Kolkata: మరోసారి డాక్టర్లను చర్చలకు పిలిచిన దీదీ

by Shamantha N |
Kolkata: మరోసారి డాక్టర్లను చర్చలకు పిలిచిన దీదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆందోళన విరమించేందుకు మరోసారి చర్చలకు రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) డాక్టర్లను కోరారు. కోల్‌కతా(Kolkata) ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు చర్చలు జరిగినప్పటికీ అవి విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఆందోళన చేస్తున్న వైద్యులు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తన నివాసానికి రావాలని సీఎం నిరసనకారులను కోరారు. బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ ఈ మేరకు వైద్యులకు లేఖ రాశారు. ‘‘నిరసనలో పాల్గొన్న వైద్యుల ప్రతినిధులను ముఖ్యమంత్రితో చర్చలకు పిలవడం ఇది ఐదోసారి. ఇదే ఆఖరిసారి కూడా. కాళీఘాట్‌లోని సీఎం నివాసంలో చర్చలు జరపుతాం. సాయంత్రం 5 గంటలకు సమావేశం ప్రారంభిస్తాం. మీరు డిమాండ్‌ చేసినవిధంగా సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేయడానికి కుదరదు. దానికి బదులుగా సమావేశంలోని కీలక అంశాలను ఇరువర్గాలు రికార్డు చేసుకోవచ్చు’’ అని లేఖలో పేర్కొన్నారు. సాయంత్రం 4:45 గంటలకు వేదిక వద్దకు చేరుకోవాలని అందులో ఉంది. చర్చల కోసం ఎదురుచూస్తున్నామని.. సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు దీనిపై డాక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

గతంలోనూ చర్చలు

ఇటీవలే డాక్టర్లను చర్చలకు పిలిచినా.. వారికి కొన్ని షరతులు పెట్టడంతో వారు భేటీకి వెళ్లలేదు. దీంతో సీఎం స్వయంగా స్వస్థ్‌ భవన్‌ వద్దకువెళ్లి ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. చర్చలు జరపడానికి రాష్ట్ర సచివాలయంలో సమావేశానికి పిలిచారు. దీంతో,దీదీ పిలుపు మేరకు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి వైద్యులు వెళ్లారు. అయితే అప్పటికే సమావేశం కోసం మూడు గంటల పాటు వేచి ఉన్నామని.. ఆలస్యమైనందున ఇప్పుడు చర్చలు నిర్వహించలేమని సీఎం కార్యాలయం ప్రకటించింది. దీంతో వైద్యులు వెనుదిరగాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed