Imprisonment : బాలికపై అత్యాచారం కేసు.. నిందితుడికి ఏడేళ్ల జైలు

by Hajipasha |
Imprisonment : బాలికపై అత్యాచారం కేసు.. నిందితుడికి ఏడేళ్ల జైలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఐదేళ్ల క్రితం బాలిక (11)పై అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి(45) మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. దీంతోపాటు అతడిపై రూ.10వేల జరిమానా కూడా విధించింది. బాలిక కుటుంబంతో తనకు వివాదం ఉందని, అందువల్లే కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని నిందితుడి తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో కోర్టు విభేదించింది. నేరాభియోగాలను నిరూపించేందుకు బాధిత బాలిక సహా మొత్తం ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలు లభించిన విషయాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది. ‘‘బాధిత బాలిక, నిందితుడు థానే జిల్లాలోని దివా ఏరియాలో నివసించేవారు. 2019 నవంబరు 22న.. ఎవరో పిలుస్తున్నారు అంటూ సదరు బాలికకు నిందితుడు చెప్పాడు.

అయితే అతడి మాయమాటలను బాలిక పట్టించుకోలేదు. దీంతో అతగాడు బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని ఒక స్కూలు వద్ద ఖాళీగా ఉన్న గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయినా ధైర్యంగా సదరు బాలిక కేకలు వేయడంతో.. అక్కడికి స్థానికులు చేరుకొని నిందితుడిని పోలీసులకు అప్పగించారు’’ అని ఈ ఘటన గురించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంధ్య హెచ్.మాత్రే వివరించారు.అంతకుముందు 2012లో ఇదే విధంగా ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడిన ఘటనలో నిందితుడికి ఏడేళ్ల శిక్షపడిందని ఆమె గుర్తు చేశారు. 2012 నుంచి 2019 వరకు జైలులో గడిపిన నిందితుడు.. విడుదలయ్యాక కూడా అదే పోకడను కొనసాగించాడని న్యాయస్థానానికి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed