Rajnath singh: అఫ్జల్ గురును సన్మానిస్తే బాగుండేదా?.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ ఫైర్

by vinod kumar |
Rajnath singh: అఫ్జల్ గురును సన్మానిస్తే బాగుండేదా?.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: 2001 పార్లమెంటు దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురును ఉరితీయడం వల్ల ప్రయోజనం లేదని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అఫ్జల్ గురుకు పూలమాల వేసి సన్మానిస్తే బాగుండేదా అని ప్రశ్నించారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపిస్తోందని ఆరోపించారు. రాంబన్ జిల్లాలో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘అఫ్జల్ గురుని ఉరి తీయకూడదని ఒమర్ చెప్పిన మాట నేను ఇటీవల విన్నాను. ఉరితీసే బదులు అఫ్జల్ గురుకు పూలమాల వేసి ఉండాలా?’ అని ఫైర్ అయ్యారు. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) ప్రజలు భారతదేశంలో భాగం కావాలని కోరుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు.

పాకిస్తాన్ పీఓకే ప్రజలను విదేశీయులుగా పరిగణిస్తుంటే, భారత్ మాత్రం వారిని సొంత వారిగా భావిస్తోందని పేర్కొన్నారు. పీఓకే విదేశీ భూమి అని పాకిస్థాన్ అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడంపై నేషనల్ కాన్ఫరెన్స్ మాట్లాడుతోందని కానీ అది ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో గత ఐదేళ్లలో 40,000 ఉద్యోగాలు సృష్టించామన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే ఎన్సీని ప్రజలు అంగీకరించబోరని విమర్శించారు.

Advertisement

Next Story