Rajnath Singh: ఏఐతో సైనిక కార్యకలాపాల్లో మార్పు.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by vinod kumar |
Rajnath Singh: ఏఐతో సైనిక కార్యకలాపాల్లో మార్పు.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సైనిక కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్( ఏఐ)కి ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. శనివారం జరిగిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ 62వ కాన్వొకేషన్ వేడుకలో ఆయన ప్రసంగించారు. ఏఐతో గణనీయమైన మార్పులు వస్తాయని, అయితే ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవాలని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు ఒకదాని కొకటి అనుసంధానించబడి ఉన్నాయన్నారు. సైనిక నాయకులు తీసుకున్న నిర్ణయాలు యుద్ధభూమిని దాటి దౌత్యం, ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి విస్తరించే సుదూర పరిణామాలను కలిగి ఉంటాయని, కాబట్టి ఈ రంగాల్లో పట్టు సాధించడం ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పారు.

ఇటీవల లెబనాన్‌లో పేజర్లను హ్యాక్ చేసి పేల్చిన ఘటనలను ప్రస్తావించిన రాజ్‌నాథ్.. దైనందిన జీవితంలో విస్తరించిన సాంకేతికతకు ఆయుధాలుగా మార్చగల శక్తి ఉందని, ఇది ఎంతో ప్రమాదకరమైందని తెలిపారు. ప్రత్యర్థులు ఈ సామర్థ్యాలను ఉపయోగించుకునే ఆలోచనలో ఉంటే, వాటిని ఎదుర్కొనేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం, పటిష్టమైన రక్షణ వ్యవస్థను పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ దృష్యా సాయుధ దళాలు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Advertisement

Next Story