విపక్ష నేతగా రాహుల్‌.. సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం

by Hajipasha |
విపక్ష నేతగా రాహుల్‌.. సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈవిషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని రాహుల్‌గాంధీ అంగీకరిస్తారా ? అని మీడియా ప్రతినిధులు కేసీ వేణుగోపాల్‌ను ప్రశ్నించగా.. ‘‘త్వరలోనే రాహుల్ గాంధీ దీనిపై నిర్ణయం తీసుకుంటారు’’ అని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ, భారత్ జోడో యాత్ర వల్లే దేశంలో కాంగ్రెస్‌ పునరుజ్జీవనం ప్రారంభమైందన్నారు. లోక్‌సభలో విపక్షాల గొంతుకను బలంగా వినిపించే స్థాయి కలిగిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున రాహుల్‌గాంధీ చేసిన ప్రచారాన్ని కూడా సీడబ్ల్యూసీ ప్రశంసించిందని ఆయన తెలిపారు. రాహుల్‌ ‌గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని సీడబ్ల్యూసీ కోరిక అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు కుమారి సెల్జా తెలిపారు. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీకి పార్లమెంట్​లో సమాధానం చెప్పగల బలమైన నాయకుడు రాహుల్ గాంధీ అని, అందుకే ఆయన లోక్​సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ సుఖ్వీందర్ సింద్ రంధావా అభిప్రాయపడ్డారు.

365 రోజుల పాటు ప్రజల మధ్యే కాంగ్రెస్

సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు నియంతృత్వ, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు తగిన సమాధానం చెప్పారన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా, నైతికంగా మోడీ ఓడిపోయారు. ఎందుకంటే ఆయన పేరుతోనే ఈసారి బీజేపీ ఎన్నికలకు వచ్చింది’’ అని ఖర్గే విమర్శించారు. ఇండియా కూటమి పార్లమెంట్ లోపల, బయట సమష్ఠిగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 365 రోజుల పాటు ప్రజల మధ్యే ఉంటుందన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికల్లో బాగా రాణించింది. లోక్​సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ స్థాయిలో ఫలితాలను పొందలేకపోయింది. దీనిపై విశ్లేషణ చేసుకుంటాం. త్వరలోనే ప్రతి రాష్ట్రంలో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తాం. పార్టీ ఓట్ల శాతాన్ని పెంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం’’ అని ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం, సీట్లు పెరిగాయన్నారు. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారని ఖర్గే పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఓటర్ల ప్రాబల్యం ఉన్న సీట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయన్నారు. మున్ముందు పట్టణ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ చీఫ్ చెప్పారు. ‘‘లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నాం. ఇండియా కూటమి ఐక్యంగా ఉండాలి. ప్రజలు ఇండియా కూటమిపై విశ్వాసం ఉంచారు’’ అని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed