Manipur: మణిపూర్‌లోకి మయన్మార్ జాతీయులు..

by Vinod kumar |
Manipur: మణిపూర్‌లోకి మయన్మార్ జాతీయులు..
X

ఇంఫాల్/న్యూఢిల్లీ: హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోకి ఈ నెల 22, 23 తేదీల్లో 718 మంది మయన్మార్ జాతీయులు అక్రమంగా ప్రవేశించారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా విదేశీయులను భారత్‌లోకి ఎలా అనుమతించాలో తెలపాలని అస్సాం రైఫిల్స్‌ను మణిపూర్ ప్రభుత్వం ఆదేశించిందని రాష్ట్ర హోం శాఖ తెలిపింది. లోయ ప్రాంతంలో నివసించే మెయిటీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ తెగల మధ్య రెండు నెలలుగా జాతి హింస కొనసాగుతోంది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల్లోనే 700 మందికి పైగా మయన్మార్ వాసులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారని అస్సాం రైఫిల్స్‌ను అడగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మయన్మార్ జాతీయులు తమ వెంట ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తీసుకొచ్చారా.. అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఖంపత్ వద్ద జరుగుతున్న ఘర్షణల కారణంగా మహిళలు, పిల్లలతో సహా 718 మంది శరణార్థులు ఇండో-మయన్మార్ సరిహద్దును దాటి చందేల్ జిల్లా మీదుగా మణిపూర్‌లోకి ప్రవేశించారని హెడ్‌క్వార్టర్స్ 28 సెక్టార్ అస్సాం రైఫిల్స్ నివేదించినట్లు మణిపూర్ హోం శాఖ పేర్కొన్నది.

సరైన పత్రాలు లేని వారు మణిపూర్‌లోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం రైఫిల్స్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమంగా ప్రవేశించిన వారి బయోమెట్రిక్, ఫొటోగ్రాఫ్‌లను సేకరించి తక్షణమే వెనక్కి పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. మణిపూర్ లో ఆందోళనకారులకు మయన్మార్ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. మే 3వ తేదీన ప్రారంభమైన జాతి హింస నుంచి మణిపూర్ నెమ్మదిగా కోలుకుంటోంది. అయితే.. ఈ ఘటనలో 150 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed