Women Bites Husband's Finger: నానబెట్టిన శనగలు తినలేదని భర్త వేలు కొరికేసిన భార్య!

by Ramesh N |   ( Updated:2024-12-05 05:36:03.0  )
Women Bites Husbands Finger: నానబెట్టిన శనగలు తినలేదని భర్త వేలు కొరికేసిన భార్య!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నానబెట్టిన శనగలు తినలేదని భర్తపై భార్య విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ క్రమంలోనే భార్య బారి నుంచి తప్పించుకున్న భర్త స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. భర్త పోలీసులకు తెలిపిన ప్రకారం.. పుణేలోని సోమవార్‌‌పేట్‌లో ఓ ఇంట్లో 44 ఏళ్ల భర్త, 40 ఏళ్ల భార్య జీవనం సాగిస్తున్నారు. డిసెంబర్ 1న రాత్రి నానబెట్టిన శనగల విషయమై ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. నానబెట్టిన శనగలు తినాలని భార్య ఇవ్వగా.. భర్త అందుకు నిరాకరించాడు. తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన భార్య అతడితో గొడవపడింది. భర్త ఎదురు తిరగడంతో సుత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. తర్వాత మిక్సీ జార్‌తో తలపై భాదింది. దాడి నుంచి తప్పించుకునేందుకు తలకు చేతులు అడ్డం పెట్టుకోవడంతో భర్త వేలు కొరికేసింది. కర్రతో విచక్షణారహితంగా కొట్టింది.

ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణకు వస్తాం ఇంటికి వెళ్లమని చెప్పగా.. అప్పటికే భయంతో వణికిపోతున్న బాధితుడు నిరాకరించాడు. రాత్రికి తనకు పోలీస్‌స్టేషన్‌లోనే ఆశ్రయం కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. కాగా, ఈ జంటకు వివాహమై 16-17 ఏళ్లైంది. పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. భర్త రైతు, భార్య గృహిణి, వీరికి చాలా కాలంగా గొడవలు అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కోర్టులో వీరి విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉంది. భర్తపై దాడి చేసిన ఘటనలో భార్య పై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.

Advertisement

Next Story