Pune Teen Got Bail: పోర్షే కారుతో గుద్దితే ఇద్దరు మృతి.. 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్

by Ramesh N |
Pune Teen Got Bail: పోర్షే కారుతో గుద్దితే ఇద్దరు మృతి.. 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదివారం అర్ధరాత్రి ఒక మైనర్ బాలుడు లగ్జరీ కారు పోర్షేను వేగంగా డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న అతడిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 15 గంటల తర్వాత బెయిల్‌పై బయటపడ్డాడు. నిందితుడు పుణెకు చెందిన ప్రముఖ రియల్టర్ కుమారుడు. అయితే, మైనర్‌కు షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని అతని తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ చెప్పారు. అతను 15 రోజుల పాటు ఎరవాడలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలి. ప్రమాదాలపై ఒక వ్యాసం రాయాలి. అతని మద్యపాన అలవాటుకు చికిత్స చేయించుకోవాలి. కౌన్సెలింగ్ సెషన్‌లు తీసుకోవాలి అంటూ షరతులు విధించారు.

అయితే, ఈ ప్రమాదం పూణేలోని కళ్యాణి నగర్‌లో తెల్లవారుజామున 2.15 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని అనీష్, అశ్విని కోస్టాగా గుర్తించారు. వారు స్నేహితులతో కలిసి మోటార్‌సైకిళ్లపై ఇంటికి తిరిగి వస్తుండగా కళ్యాణి నగర్ జంక్షన్ వద్ద పోర్షే కారును వేదాంత్ అగర్వాల్ (17) అనే మైనర్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తూ.. వారి బైక్‌ను ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలోనే అతనిపై పోలీసులు ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో 279 (ర్యాష్ డ్రైవింగ్), 304A (నిర్లక్ష్యం వల్ల మరణం), 337 (మానవ ప్రాణాలకు హాని కలిగించడం), 338 (తీవ్రమైన గాయం కలిగించడం), మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలతో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా, మైనర్, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడని పబ్‌లో స్నేహితులతో పార్టీ చేసుకోని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చేశాడని తెలిసింది. అయితే అతని బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని డబ్బులు ఉన్నవాడు కాబట్టి బెయిల్ 15 గంటల్లో వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed