Pulwama terror attack: పుల్వామా దాడి కేసు నిందితుడు మృతి

by Shamantha N |
Pulwama terror attack: పుల్వామా దాడి కేసు నిందితుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పుల్వామా దాడి (Pulwama terror attack) కేసులో నిందితుడు గుండెపోటుతో(Heart attack) చనిపోయాడు. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన ఘటనలో 19 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో జమ్మూకశ్మీర్‌ కాకాపోరాలోని హజీబల్ గ్రామానికి చెందిన బిలాల్‌ అహ్మద్‌ కుచేయ్ కూడా ఒకడు. ఆ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఏడుగురిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో బిలాల్ కూడా ఉన్నాడు. అప్పట్నుంచి కిష్ట్వార్ జిల్లా జైలులో ఉంటున్నాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 17న అనారోగ్యానికి గురైన బిలాల్ ను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం రాత్రి అతను గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.

పుల్వామా దాడి

2019లో పూల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. నాడు ఆ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ఆగస్టు 25, 2020న 19 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. వీరు పాకిస్థానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఉగ్రదాడితో సంబంధం ఉన్న ఆరుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. మరికొందరు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుల్లో బిలాల్‌ కూడా ఉన్నాడు. కాగా.. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Next Story

Most Viewed