పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు…భయభ్రాంతులకు గురైన విద్యార్థులు

by Kalyani |
పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు…భయభ్రాంతులకు గురైన విద్యార్థులు
X

దిశ, వీపనగండ్ల: నేటి యుగంలో కూడా కొందరు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను, విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతేకాక సినిమాలు, సీరియల్స్ లో వచ్చే సంఘటనలు చూసి కొందరు ఆకతాయిలు కూడా క్షుద్ర పూజలు అంటూ భయపెడుతున్నారు. మండల పరిధిలోని తుమ్ముకుంట జిల్లా పరిషత్ పాఠశాల ఎదుట ఆదివారం అర్ధరాత్రి సమయంలో కొందరు క్షుద్రపూజలు చేసినట్లు గుర్తించారు. పాఠశాల ఎదుట రతి ముగ్గు వేసి వాటిపై నిమ్మకాయలు, పసుపు కుంకుమ చల్లి, కల్లు కల్లు సీసా ఉంచి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనపడినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు.

సోమవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పాఠశాల గదిలోకి వెళ్ళడానికి భయపడి బయటనే నిలిచిపోయారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు క్షుద్ర పూజకు ఉపయోగించిన వస్తువులను కల్లు సీసాను అక్కడి నుంచి తీయించి నీళ్లతో శుభ్రం చేయించారు. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించి, భయభ్రాంతులకు గురికాకుండా ఉండాలని విద్యార్థులకు ధైర్యం కల్పించారు. గతంలో కూడా ఒక సారి పాఠశాల ఎదుట క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉండగా తొలగించామని, మళ్లీ అలాంటి ఘటనే పునరావృతమైందని తెలిపారు. పాఠశాల ఎదుట జరిగిన సంఘటన పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి వహీద్ తెలిపారు. పాఠశాల వద్ద ఇలాంటి ఘటనలు మరో మారు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed