ఇజ్రాయిల్‌లో పెల్లుబికిన ప్రజాగ్రహాం.. ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసనలు

by samatah |
ఇజ్రాయిల్‌లో పెల్లుబికిన ప్రజాగ్రహాం.. ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసనలు
X

జెరూసాలెం: ఇజ్రాయిల్‌లో ప్రజాగ్రహాం పెల్లుబికింది. ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు న్యాయవ్యవస్థ సంస్కరణలపై ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సోమవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున రాజధాని వీధుల్లో చేరి నిరసనలు తెలిపారు. వెంటనే ప్రధాని సంస్కరణల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని కార్యాలయం వద్ద గుంపులుగా నిరసనలకు దిగారు. రంగంలోకి దిగిన సైన్యం పోలీసులతో కలిసి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని నివాసం వద్ద గుమిగూడిన వారిని వాటర్ కెనన్లను ఉపయోగించి చెదరగొట్టారు. ఈ నిరసనల్లో సుమారు 7 లక్షల మందికి పైగా భాగమయ్యారు.

స్వీయ ప్రయోజనాలకే న్యాయసంస్కరణలు

అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహు స్వీయ రక్షణ కోసం పన్నిన వ్యుహమని పలువురు ఆరోపించారు. న్యాయవ్యవస్థలో మార్పులతో తనకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని పేర్కొన్నారు. నిరసనలు తీవ్రం కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశంలోని ప్రధాన విమానశ్రయాల్లో రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు విమానశ్రయ వర్కర్లు కూడా నిరసనల్లో భాగమయ్యారు. మరోవైపు ప్రధాని నెత్యన్యాహు రక్షణ మంత్రిని తొలగించారు. కాగా, ప్రభుత్వం వెంటనే న్యాయవ్యవస్థ సంస్కరణలను నిలిపివేయాలని అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోజ్ కోరారు. మరోవైపు ఈ నిరసనలపై యూఎస్‌తో సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, నెత్యన్యాహు జడ్జిల నియమావళి పద్ధతితో పాటు ఇజ్రాయిల్ ప్రభుత్వం జారీ చేసిన చట్టాలను కోర్టులు నియంత్రించే విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదనలు చేశారు. ఇది కాస్తా ఏకపక్షంగా, స్వీయ ప్రయోజనాల కోసం ఉన్నాయని వ్యతిరేకత ఎదురైంది. మరోవైపు ప్రధాని వైఖరిని నిరసిస్తూ దేశ ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు భారత్‌తో సహా ఇతర దేశాల్లోని ఇజ్రాయిల్ ఎంబసీలు నిరసనల్లో భాగమయ్యాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి కార్యనిర్వహణ ఉండబోదని ప్రకటించాయి.

Advertisement

Next Story