రాహుల్ ఒక అమరుడి కొడుకు: బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకాగాంధీ

by Satheesh |
రాహుల్ ఒక అమరుడి కొడుకు: బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకాగాంధీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: “మా కుటుంబ సభ్యులు దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం రక్తాన్ని చిందించారు. ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. నా తండ్రిని, తల్లిని పార్లమెంటు వేదికగానే బీజేపీ అవమానించింది. నా తమ్ముడికి రకరకాల పేర్లు పెట్టింది. రాహుల్‌గాంధీకి తండ్రి ఎవరో తెలియదంటూ ఆ పార్టీ ముఖ్యమంత్రి ఒకరు కామెంట్ చేశారు. అయినా మేం మౌనంగానే ఉన్నాం” అని ప్రియాంకాగాందీ అన్నారు.

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌లో రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లపై దాఖలైన పరువునష్టం కేసులో లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిందని, కానీ పార్లమెంటు వేదికగా బీజేపీ ఎంపీలు చేసిన కామెంట్లపైనా, ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.

రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఆదివారం జరిగిన సత్యాగ్రహ సంకల్ప్ దీక్షకు పోలీసుల ఆంక్షలను ధిక్కరించి హాజరైన ప్రియాంకాగాంధీ పై వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని అవమానించే తీరులో మాట్లాడిన నేతలపై బీజేపీ తీసుకున్న చర్యలేంటని ప్రశ్నిస్తూనే.. వారిపై అనర్హత వేటు ఎందుకు పడలేదని నిలదీశారు. వారెవరిపైనా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ప్రధాని మోడీని రాహుల్‌గాంధీ ఒక సందర్భంలో కౌగిలించుకుని మాట్లాడారని గుర్తుచేసిన ప్రియాంక వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను గుర్తుచేశారు. “మీపై నాకు ఎలాంటి ద్వేషమూ లేదు. మన మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. ఇద్దరివి వేర్వేరు ఐడియాలజీలు కావచ్చు. కానీ మన సిద్ధాంతాల్లో విద్వేషం ఉండకూడదు” అని రాహుల్‌గాంధీ ఆ సందర్భంగా మోడీకి స్పష్టం చేశారంటూ ప్రియాంక ఉదహరించారు.

రాహుల్‌గాంధీ ఒక అమరుడి కుమారుడని అభివర్ణించారు. తొలి రోజు నుంచీ రాహుల్‌గాంధీని బీజేపీ పార్లమెంటు వేదికగానే విమర్శిస్తూ అవమానిస్తూ ఉన్నదని, గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ గురించి సెటైర్లు వేస్తూ ఉన్నదని ఆమె గుర్తుచేశారు. ఒక అమరుడి కుమారుడైనా దేశ ద్రోహిగా, మీర్ జాఫర్‌గా బీజేపీ సభ్యులు అవమానిస్తున్నారని అన్నారు. రాహుల్‌గాంధీకి ఆయన తల్లి ఎవరో కూడా తెలియదంటూ బీజేపీకి చెందిన ఒక ముఖ్యమంత్రి కామెంట్ చేసి ఘోరంగా అవమానించారని ఆమె గుర్తుచేశారు.

నిత్యం తమ కుటుంబాన్ని బీజేపీ నేతలు విమర్శిస్తూనే ఉన్నారని, కానీ ఒక్కరిపైనా కేసులు నమోదు కాలేదన్నారు. స్వయంగా ప్రధాని మోడీయే పార్లమెంటు సాక్షిగా “ఈ కుటుంబ ఎందుకు నెహ్రూ పేరును పెట్టుకోవడంలేదు?” అని వ్యాఖ్యానించి మొత్తం కశ్మీరీ పండిట్ల కుటుంబాలనే అవమానించారని ఆమె వ్యాఖ్యానించారు. తండ్రి పేరును పిల్లలు పెట్టుకోవడం దేశంలో ఒక సంప్రదాయంగా వస్తున్న సంగతి మోడీకి తెలియదా అని ప్రియాంక ప్రశ్నించారు.

Advertisement

Next Story