ఆర్మీ అధికారులపై దాడి ఘటనపై స్పందించిన ప్రియాంక, రాహూల్

by Harish |
ఆర్మీ అధికారులపై దాడి ఘటనపై స్పందించిన ప్రియాంక, రాహూల్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో కొంతమంది దుండగులు ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి చేసి వారి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే, అధికార బీజేపీ, మోడీపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌లో స్పందించిన ఆమె, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన హృదయ విదారకంగా ఉందని అన్నారు. దేశంలో ప్రతిరోజూ 86 మంది మహిళలు అత్యాచారాలకు, క్రూరత్వానికి బలైపోతున్నారు. ఇంటి నుంచి వీధుల వరకు, రోడ్ల నుంచి ఆఫీసుల వరకు ప్రతిచోటా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటివి ప్రతిరోజూ లక్షలాది మంది మహిళల ఆత్మస్థైర్యాన్ని అణిచివేస్తున్నాయని అన్నారు.

మహిళల భద్రత గురించి ప్రధాని మోడీ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నప్పటికీ, రక్షణకు సంబంధించి తీవ్రమైన చర్యల కోసం దేశవ్యాప్తంగా మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ చివరకు ఎప్పుడు ముగుస్తుంది? అని ఆమె పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహూల్ గాంధీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్‌లో మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా ఉందని, మహిళలపై పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈ ఘటనపై సమాజం, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇలాంటి వాటిపై తీవ్రంగా ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు.

ఘటన విషయానికి వస్తే, బుధవారం మధ్యప్రదేశ్‌లో మోవ్-మండలేశ్వర్ రోడ్డులో సరదాగా సేద తీరడానికి వచ్చిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ అధికారులు, వారి స్నేహితురాళ్లపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అలాగే వారిలో ఒక మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిని పట్టుకోగా, మరో నలుగురిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed