పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోడీ

by Mahesh Kanagandla |
పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ‘పీఎం కిసాన్ సమ్మాన్’ నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడతలో భాగంగా రూ. 20 వేల కోట్లను సుమారు 9.4 కోట్ల మంది రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. మహారాష్ట్రలోని వాశింలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ నిధులను ప్రధాని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు, రాష్ట్రమంత్రి సంజయ్ రాథోడ్‌లు హాజరయ్యారు.

18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేయడాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ వేడుకలు నిర్వహించారు. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేడుకలు జరిగాయి. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ఈ కార్యక్రమంలో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా సుమారు 2.5 కోట్ల మంది రైతులు హాజరయ్యారు.

కర్షకులకు ఆర్థిక సహాయం అందించాలని, సాగు పెట్టుబడికి అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి యేటా రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000లను భూమి ఉన్న రైతులకు అందిస్తున్నది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 18వ ఇన్‌స్టాల్‌మెంట్ వరకు మొత్తం విడుదల చేసిన నిధుల మొత్తం రూ. 3.4 లక్షల కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 11 కోట్ల మంది రైతులకు అండగా నిలిచినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story