ఎన్డీయే‌కు రాష్ట్రపతి పిలుపు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం

by Hajipasha |
ఎన్డీయే‌కు రాష్ట్రపతి పిలుపు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం
X

దిశ, నేషనల్ బ్యూరో : మరోసారి ప్రధానమంత్రి పదవిని నరేంద్రమోడీ చేపట్టే దిశగా వడివడిగా అడుగులుపడ్డాయి. శుక్రవారం ఉదయం ఎన్డీయే లోక్‌సభా పక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఉన్న సెంట్రల్‌ హాల్​లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈమేరకు ఎంపీలంతా కలిసి తీర్మానం చేశారు. తొలుత ఎన్డీయే లోక్‌సభా పక్ష నేతగా మోడీ పేరును రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సహా ఇతర మిత్రపక్షాల నేతలంగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈసందర్భంగా ప్రసంగించే క్రమంలో మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ.. ఎన్డీయేకు ‌‘న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, యాస్పిరేషనల్‌ ఇండియా’ అనే నిర్వచనాన్ని ఇచ్చారు. ఈ భేటీ అనంతరం ఎన్డీయే లోక్‌సభాపక్ష నేత నరేంద్ర మోడీ, కూటమి నేతలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈసందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఆహ్వాన లేఖను మోడీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి రాష్ట్రపతి ఆరా తీయగా.. జూన్​ 9న(ఆదివారం) సాయంత్రం ప్రమాణం చేస్తానని మోడీ చెప్పారు.

మంత్రివర్గ సభ్యుల జాబితాను రాష్ట్రపతికి పంపిస్తాం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్​ బయట మీడియాతో మోడీ మాట్లాడారు. ‘‘దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. దేశ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు మరింత ఉత్సాహంగా పని చేస్తాం. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రక్రియ కోసం రాష్ట్రపతి భవన్​ ఏర్పాట్లు మొదలుపెట్టింది. మంత్రివర్గ సభ్యుల పేర్లతో కూడిన జాబితాను త్వరలోనే రాష్ట్రపతికి పంపిస్తాం. జూన్ 9న సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది’’ అని ప్రధాని మోడీ చెప్పారు.

మా పదేళ్ల పాలన ట్రైలర్​ మాత్రమే

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్డీయే 3.0 ప్రభుత్వంలో తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేస్తాను’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘నేషన్​ ఫస్ట్’' సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఆర్గానిక్ కూటమి ఎన్డీయే అని మోడీ చెప్పారు. రాబోయే పదేళ్ల ఎన్డీఏ హయాంలో సుపరిపాలన, అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. ‘‘మా పదేళ్ల పాలన ట్రైలర్​ మాత్రమే. దేశ అభివృద్ధి కోసం మేం కష్టపడి పనిచేస్తాం.. వేగంగా పని చేస్తాం.. అది దేశ ప్రజలందరికీ తెలుసు’’ అని మోడీ పేర్కొన్నారు. ‘‘పొత్తులు లోక్​సభ ఎన్నికల కోసమే అని ఇండియా కూటమి పార్టీలు చెబుతున్నాయి.. అది వారి అధికార దాహానికి నిదర్శనం’’ అని ఆయన విమర్శించారు. ‘‘ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన ఇండియా కూటమి నేతలు ఇప్పుడు నోరు మూశారు. ఇదే ప్రజాస్వామ్యం బలం’’ అని మోడీ పేర్కొన్నారు. ఈవీఎం, ఆధార్​ వంటి సాంకేతిక పురోగతిని ప్రశ్నించినప్పుడే.. ఇండియా కూటమి పార్టీలు మునుపటి శతాబ్దానికి చెందినవని అందరికీ అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. ‘‘పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం​ 100 ఎంపీ సీట్లను సాధించలేకపోయింది. మరో పదేళ్లయినా కాంగ్రెస్ పరిస్థితి అంతే. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన సీట్ల సంఖ్య..ఈ ఒక్కసారి ఎన్డీయే కూటమి గెల్చిన సీట్లకంటే తక్కువ’’ అని మోడీ తెలిపారు.

క్యాబినెట్ బెర్త్‌లు ఇస్తామని బురిడీ కొట్టిస్తారు

‘‘క్యాబినెట్ బెర్త్‌ల విషయంలో బురిడీ కొట్టించేవారు ఉంటారు జాగ్రత్త. కొంతమంది మీ దగ్గరకు వచ్చి, క్యాబినెట్‌ బెర్త్ ఇప్పిస్తామని చెప్తారు. టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందంటే.. నా సంతకాలతో ఉన్న జాబితా కూడా బయటకు రావొచ్చు. ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి కుట్రలకు చిక్కొద్దు. ఇలాంటి విషయాల్లో విపక్ష కూటమికి డబుల్ పీహెచ్‌డీ ఉంది’’ అని ఎన్డీయే కూటమి ఎంపీలను మోడీ కోరారు. ఆయన చెప్పిన మాటలతో కూటమి ఎంపీలంతా చిరునవ్వులు చిందించారు. ‘‘దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారు. తమిళనాడులో సీట్లు గెలవలేకపోయినా ఓట్లు పెరిగాయి. కేరళ నుంచి తొలిసారిగా మా ప్రతినిధి లోక్‌సభలోకి అడుగుపెడుతున్నారు. అరుణాచల్‌, సిక్కింలో క్లీన్‌స్వీప్‌ చేశాం. ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలను అద్దం పట్టింది’’ అని మోడీ వ్యాఖ్యానించారు.

ఎన్డీయే గెలుపు కోసం మోడీ రేయింబవళ్లు శ్రమించారు : చంద్రబాబు

ఎన్డీయేను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్రమోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలోనూ మూడు బహిరంగ సభలు, ర్యాలీల్లో మోడీ పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మోడీ సారథ్యంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలోనే భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు.

భద్రతా వలయంలోకి రాష్ట్రపతి భవన్

జూన్ 9న సాయంత్రం ప్రధాని ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 కంపెనీల పారామిలటరీ బలగాలు, ఎన్​ఎస్​జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లతో రాష్ట్రపతి భవన్​లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 8వేల మంది అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో సుమారు 2,500 మందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

మోడీ పాదాలను తాకేందుకు నితీశ్ యత్నం

ఎన్డీయే కూటమి నాయకుడిగా నరేంద్ర మోడీకి మద్దతు తెలిపేందుకు వెళ్లిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్.. మోడీతో చేతులు కలిపి, ఆయన పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. అయితే తన పాదాల్ని తాకొద్దని మోడీ తిరస్కరిస్తూ నితీశ్‌తో కరచాలనం చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.అంతకుముందు నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఏ సందర్భంలోనైనా నేను ప్రధాని మోడీతోనే ఉంటాను. ఇండియా కూటమి నేతలు ఈసారి పొరపాటున కొన్నిచోట్ల గెలిచారు. దేశం కోసం వాళ్లు ఏమీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో వాళ్లందరూ కచ్ఛితంగా ఓడిపోతారు’’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story