Elections 2024: ఒక్క మహిళ కోసం పర్వతాల మధ్యలో పోలింగ్ కేంద్రం.. ఎక్కడో తెలుసా..?

by Indraja |   ( Updated:2024-04-19 07:38:52.0  )
Elections 2024: ఒక్క మహిళ కోసం పర్వతాల మధ్యలో పోలింగ్ కేంద్రం.. ఎక్కడో తెలుసా..?
X

దిశ వెబ్ డెస్క్: నేడు 2024 సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇక నేడు మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే పండగ వాతావరణాన్ని తలపించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం కృషి చేస్తోంది.

ఈ నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలకు అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ ఒక్క ఓటరు కూడా పోలింగ్‌కు దూరం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఒకే ఒక్క ఓటరు ఉన్న ప్రాంతంలో కూడా ఈసీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది.

ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లోక్‌సభ ఎన్నికలతోపాటే అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి. కాగా అంజావ్‌ జిల్లాలోని మాలెగావ్‌ అనే మారుమూల గ్రామం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. కాగా ఈ గ్రామం అరుణాచల్‌ ఈస్ట్‌ లోక్‌సభ, హుయులియాంగ్‌ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది.

ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. కాగా ఆ కుటుంబాలు కూడా వేరే నియోజవర్గం పరిధిలోకి మారిపోయాయి. అయితే సొకేలా తయాంగ్‌ (44) అనే మహిళ మాత్రం మరో నియోజకవర్గానికి మారడానికి నిరాకరించారు. దీనితో ఆ ఒక్క మహిళల కోసం ఆ గ్రామంలో తాత్కాలికంగా ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు.

అయితే ఆ గ్రామం ఎత్తైన పర్వతాల మధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ ఉంది. కనుక ఆ గ్రామాన్ని చేరుకోవాలి అంటే కేవలం నడక మార్గం ఒక్కటే దారి. అయినా ఆ ఒక్క మహిళ కోసం పోలింగ్‌, భద్రతా, పోర్టర్లలతో కూడిన ఎన్నికల సిబ్బంది 39 కి.మీ.ల దూరం సాహసయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed