రిషీ సునాక్‌, మాక్రాన్‌తో మోడీ కీలక చర్చలు

by S Gopi |
రిషీ సునాక్‌, మాక్రాన్‌తో మోడీ కీలక చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటలీలో జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పలు దేశాల అగ్రనేతలతో సమావేశమయ్యారు. సదస్సు జరిగినంతసేపు ప్రధాని మోడీ బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిత్ జెలెన్‌స్కీలతో విడివిడిగా భేటీ అయ్యారు.

రిషి సునాక్‌తో భేటీ..

ప్రధానంగా బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్‌తో ప్రధాని మోడీ భేటీ కావడం, వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలు ఆసక్తికరం. మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి జీ7 పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోడీ.. రిషి సునాక్‌తో ద్వైపాక్షిక అంశాలతో పాటు, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సదస్సు తర్వాత వీరిద్దరు కలవడంతో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని మోడీ అన్నారు. రక్షణ రంగంలో సంబంధాలను మరింత బలోపేతం చేయడం గురించి కూడా మేము మాట్లాడామని తెలిపారు. ముఖ్యంగా ఇరు దేశాల అధినేతల సంభాషణలో వాణిజ్యం, రక్షణ వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సహకారం, ఉన్నత సాంకేతిక రంగాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం కీలకమైన రోడ్‌మ్యాప్ 2030 అమలుపై ప్రధాని నరేంద్ర మోడీ,బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ చర్చించారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడితో..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వివిధ అంతర్జాతీయ అంశాలపై అధినేతలు చర్చించారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు. ఈ అంశంపై ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.. ఇరువురం ఏడాది కాలంలో నాలుగోసారి సమావేశం అయ్యాం. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు తామిద్దరం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిర్దర్శనం. రెండు దేశాల సంబంధాలతో పాటు రక్షణ, భద్రత, ఏఐ, టెక్నాలజీ, అంతరిక్షం, విద్య, వాతావరణ చర్య, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ టెక్నాలజీలు, కనెక్టివిటీ, సంస్కృతి వంటి అంశాలు మా మధ్య చర్చకు వచ్చాయి. యువతలో ఇన్నోవేషన్, రీసెర్చ్ వర్క్‌ను ప్రోత్సహించడం గురించి మాట్లాడుకున్నామని, వచ్చే నెలలో పారిస్ ఒలంపిక్స్‌కు అతిథ్యం ఇస్తున్నందుకు అభినందనలు తెలియజేసినట్టు ' మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వ్లాదిమిర్ జెలెన్‌స్కీ..

జీ7 సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశమైన ప్రధాని మోడీ కీలకమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వివరాల గురించి మాట్లాడారు. జెలెన్‌స్కీ యుద్ధ పరిస్థితులను మోడీకి వివరించారు. చర్చలు, దౌత్యం రూపంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ అండగా ఉంటుందని, ఆ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని మోడీ భరోసా ఇచ్చారు.

పోప్-మోడీ కౌగిలి..

సమ్మిట్‌లో భాగంగా ఓ సెషన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోస్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందిరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా వారిద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా భారత్‌ను సందర్శించాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించారు.

ఈ సమావేశంలో మాట్లాడిన పోప్.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) అభివృద్ధి, వినియోగించే క్రమంలో మానవాళిని దృష్టిలో ఉంచుకోవాలని జీ7 దేశాలకు సూచించారు. ఏఐ లాంటి టెక్నాలజీ మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చివేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐ సద్వినియోగం చేసుఓవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాగా, జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన తొలి పోప్‌గా ఆయన చరిత్రకెక్కారు.

Advertisement

Next Story

Most Viewed