ప్రధాని భద్రతా విచారణ కమిటీ చైర్మన్‌కు బెదిరింపులు

by Disha daily Web Desk |
ప్రధాని భద్రతా విచారణ కమిటీ చైర్మన్‌కు బెదిరింపులు
X

న్యూఢిల్లీ: ప్రధాని భద్రతా వైఫల్యంపై దర్యాప్తుకు ఏర్పాటైన కమిటీకి బెదిరింపులు తప్పడం లేదు. కమిటీ చైర్మెన్‌గా ఉన్న మాజీ జస్టిస్ ఇందు మల్హోత్రకు సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) బెదిరింపులకు గురి చేసినట్లు తెలిపారు. ఈ కేసులో వాదిస్తున్న న్యాయవాదులకు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతోపాటు ఈనెల 26న ప్రధానిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్ఎఫ్‌జేకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి న్యాయవాదులు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని ఆడియో సందేశాలు పంపించారు.

గత ఏడు రోజుల్లో న్యాయవాదులపై బెదిరింపులకు దిగడం ఇది రెండోసారి. 'ముందు మేము అడ్వకేట్లను హెచ్చరించాం. ఈ సమస్య సిక్కులకు, ప్రధాని మోడీకి మధ్య ఉంది. కానీ మీరు దీనిపై కేసు నమోదు చేసి కొత్త చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మేము ముస్లిం వ్యతిరేక, సిక్కు వ్యతిరేక సుప్రీంకోర్టు న్యాయవాదులను జవాబుదారీగా ఉంచుతాం' అని కాల్ చేసిన వ్యక్తి తెలిపారు. గత వారం కూడా ఇదే తరహా కాల్‌లో ప్రధాని మోడీకి సాయం చేయకండి అంటూ ఓ వ్యక్తి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 5న ప్రధానమంత్రి కాన్వాయ్ పంజాబ్ ఫిరోజ్‌పూర్ సమీపంలో భద్రతా సమస్యలతో రోడ్డుపై నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story