Farm Loan Waiver: మోడీ.. ఒక్కరూపాయి కూడా రైతు రుణమాఫీ చేయలేదు

by Mahesh Kanagandla |
Farm Loan Waiver: మోడీ.. ఒక్కరూపాయి కూడా రైతు రుణమాఫీ చేయలేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీయే అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామన్న హామీని పొందుపరిచింది. ఈ హామీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రధానిగా నరేంద్ర మోడీ గత 11 ఏళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. అదే పారిశ్రామికవేత్తలకైతే ఏకంగా రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేశారని మండిపడ్డారు. ప్రధాని మోడీ.. అంబానీ, అదానీల మనిషి అని వివరించారు. అందుకే అంబానీ ఇంట పెళ్లికి ప్రధాని వెళ్లాడని, తాను ప్రజల మనిషని, అందుకే వెళ్లలేదని చెప్పారు.

ఇక రాహుల్ గాంధీ తన వెంట రాజ్యాంగాన్ని(Indian Constitution) పట్టుకుని తిరగడాన్ని బీజేపీ టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పేర్కొంటూ ఆయన రాజ్యాంగాన్ని అవమానించారని, లోపలంతా ఖాళీగా ఉండే నోట్‌‌బుక్స్‌ను రాజ్యాంగం కాపీ అని పంచుతున్నారని ఆగ్రహించారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని చదివి ఉండరు. ఒక వేళ చదివి ఉంటే ఈ పుస్తకానికి ఆయన విలువ ఇచ్చేవాడు. బీఆర్ అంబేద్కర్, ఫూలే, మహత్మా గాంధీలు ఈ రాజ్యాంగాన్ని అందించారని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎత్తిపట్టేది రాజ్యాంగమేనని తెలిపారు. నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ 24 గంటలు రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉంటారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా అని నిలదీశారు.

Advertisement

Next Story