PM Modi Russia visit:మరోసారి రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోడీ

by Shamantha N |
PM Modi Russia visit:మరోసారి రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి రష్యా పర్యటనకు వెళ్లబోతున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సుకు మోడీ హాజరుకానున్నారు. అక్టోబర్ 22-23 తేదీల్లో కాజాన్‌లో జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోడీ మాస్కోలో రష్యాలో పర్యటించనున్నారు. కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన జరుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా మోడీ బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో భేటీ కానున్నారు. ‘‘గ్లోబల్ డెవలప్మెంట్ కోసం భద్రత, బహుపాక్షికత బలోపేతం చేయడం’’ అనే థీమ్‌తో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమ్మిట్ కీలకమైన ప్రపంచ సమస్యలను చర్చించడానికి వేదికగా మారుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

బ్రిక్స్ సదస్సు

ఇకపోతే, సెప్టెంబర్ నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకి ప్రధాని మోడీకి ఆహ్వానం పంపారు. బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పుతిన్ భేటీ అయ్యారు. అంతకుముందు ప్రధాని మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత జూలైలో భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లారు. కాగా.. నాలుగు నెలల్లోని ప్రధాని మోడీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. BRIC (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా) దేశాల నాయకులు 2006లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మొదటిసారిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా ఈ గ్రూపులో చేరడంతో BRICS (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) గా పేరులో మార్పు జరిగింది. ఈ కూటమికి ప్రపంచ జనాభాలో 41 శాతం, జీడీపీలో 24 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 16 శాతానికి పైగా వాటా ఉంది. ప్రపంచంలో ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్ని ఒక చోట చేర్చే ముఖ్యమైన సమూహంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed