PM Modi : ఆగస్టు 10న వయనాడ్‌లో ప్రధాని పర్యటన : కేరళ సీఎం

by Hajipasha |
PM Modi : ఆగస్టు 10న వయనాడ్‌లో ప్రధాని పర్యటన : కేరళ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో : వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి పెనువిషాదం చోటుచేసుకున్న ప్రాంతాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 10న సందర్శిస్తారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాలను ప్రధాని పరామర్శిస్తారన్నారు. వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వాన్ని తాము ఇప్పటికే కోరామని తెలిపారు. దీనిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో ఒక కమిటీని నియమించిందని ఆయన వెల్లడించారు. ఆ కమిటీ ఛైర్మన్ గురువారం ఉదయమే రాష్ట్రంలో పర్యటించారని, తప్పకుండా వయనాడ్ విషాద ఘటనకు సంబంధించి కేంద్రం నుంచి మెరుగైన సహాయం లభిస్తుందని సీఎం విజయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చూరల్ మల, ముందక్కై సహా ప్రభావిత ప్రాంతాల్లో 420 మృతదేహాలకు ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయిందని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.

‘‘అధికారికంగా ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 225 మరణాలు సంభవించాయి. వివిధ చోట్ల దాదాపు 195 మంది వ్యక్తుల శరీర భాగాలు లభ్యమయ్యాయి. డీఎన్‌ఏ టెస్టు కోసం వాటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపాం. 178 డెడ్‌బాడీస్‌ను ఇప్పటివరకు వారి సంబంధీకులకు అప్పగించాం’’ అని సీఎం విజయన్ వివరించారు. ‘‘వయనాడ్‌లో ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్‌కు 7 టన్నుల దుస్తులు విరాళంగా వచ్చాయి. అయితే అవన్నీ వాడినవి, పాతవే. దీంతో వాటిని ప్రాసెసింగ్ కోసం పంపించాం. పాత దుస్తులు వస్తుండటం వల్ల ఇలా ప్రాసెసింగ్ చేయించాల్సి వస్తోంది’’ అని ఆయన తెలిపారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ప్రత్యేకించి దక్షిణాది సినిమా రంగం నుంచి వయనాడ్‌కు మంచి చేయూత లభిస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null