మూడు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని..

by Vinod kumar |
మూడు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని..
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్, పాపువా న్యూగినియా, ఆస్ట్రేలియా దేశాల 6 రోజుల పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం ఆయన సిడ్నీ నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈవిషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రోజైన బుధవారం ప్రధాని మోడీ సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం వంటి విస్తృత అంశాలపై చర్చించారు.

ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని మోడీ లేవనెత్తగా.. భవిష్యత్తులో అటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆస్ట్రేలియాలోని ఉక్కు, బ్యాంకింగ్, ఇంధనం, మైనింగ్, ఐటీ రంగాల కంపెనీల సీఈవోలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ మౌలిక సదుపాయాల రంగాల్లో భారతదేశంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారిని కోరారు. మిషన్ గతి శక్తి, జన్ ధన్ వంటి అనేక సంస్కరణల గురించి వివరించారు.

హైడ్రోజన్ మిషన్ 2050, స్పేస్, జియోస్పేషియల్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు, వైద్య పరికరాల తయారీతో ముడిపడిన కొత్త విధానాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రధాని వెల్లడించారు. ఇక ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత పీటర్ డటన్‌తోనూ మోడీ భేటీ అయ్యారు. ఇక భారత ప్రధాని గౌరవార్థం బుధవారం సిడ్నీ హార్బర్, ఒపెరా హౌస్‌‌లు భారత జాతీయ జెండా రంగులతో వెలిగిపోయాయి. కాగా, గురువారం ఉదయం ఉత్తరాఖండ్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇది డెహ్రాడూన్‌, ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్) మధ్య నడుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed