మంత్రాలతో పేదరికం మాయం.. రాహుల్ ‘రాయల్ మెజీషియన్’ : మోడీ

by Shamantha N |
మంత్రాలతో పేదరికం మాయం.. రాహుల్ ‘రాయల్ మెజీషియన్’ : మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ఒక్క దెబ్బతో దేశంలో పేదరికం లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ కే షెహజాదా అని రాహుల్ పై కామెంట్స్ చేశారు. ఈ రాయల్‌ మాంత్రికుడు ఇన్నిరోజులు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని హొషంగాబాద్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు.

2014కి ముందు కాంగ్రెస్ రిమోట్‌తో ప్రభుత్వాన్ని నడిపింది. ఇప్పుడు ఝట్కే వాలా మంత్రం వచ్చిందని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు పేదలను అవమానించినట్లు కాదా అని ప్రశ్నించారు. అసలు అతను ఏం చెప్తున్నాడు అని అడిగారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాలా తీయిస్తుందని హెచ్చరించారు.

కాగా, గత వారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ పేదరికంపై కామెంట్స్ చేశారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ఒక్క దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల ఖాతాల్లోకి లక్ష రూపాయలు వచ్చి పడతాయని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇవే కాకుండా, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలోని కొన్ని కీలక హామీలు ఇచ్చింది. దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామంది. కనీస వేతనం రోజుకు రూ.400 చొప్పున ఇస్తామంది. ఎంఎస్పీలకు చట్టబద్ధత, సామాజిక, ఆర్థిక కులగణన, ప్రభుత్వ పరీక్షలు, పోస్టులకు రుసుములు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed