Pm modi: తీర ప్రాంత గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. ప్రధాని నరేంద్ర మోడీ

by vinod kumar |
Pm modi: తీర ప్రాంత గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తీరప్రాంత గ్రామాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వధ్వన్ పోర్టుకు ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మత్స్యకారుల కోసం సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడంలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు పూర్తి అంకితభావంతో పని చేస్తున్నాయని కొనియాడారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తున్నామన తెలిపారు.

నేడు భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చేపలను ఉత్పత్తి చేసే దేశంగా అవతరించిందని గుర్తు చేశారు. 2014లో దేశంలో చేపల ఉత్పత్తి కేవలం 8 మిలియన్ టన్నులు మాత్రమే కాగా, ఇప్పుడు దాదాపు 17 మిలియన్ టన్నులకు చేరుకుందని తెలిపారు. పదేళ్లలోనే చేపల ఉత్పత్తిని రెట్టింపు చేశామన్నారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంలో అభివృద్ధి చెందిన మహారాష్ట్ర అత్యంత ముఖ్యమైన భాగమని నొక్కిచెప్పారు. గత దశాబ్దంలో, భారతదేశ తీరప్రాంతంలో అభివృద్ధి అపూర్వమైన వేగాన్ని అందుకుందన్నారు.

ఓడరేవులను ఆధునీకరించి, జలమార్గాలను అభివృద్ధి చేశామన్నారు. యువత దాని ప్రయోజనాలను పొందారని తెలిపారు. మహిళల సాధికారతకు సైతం కట్టుబడి ఉన్నామని, వారు ప్రస్తుతం ముఖ్యమైన స్థానాల్లో పని చేస్తున్నారని చెప్పారు. చేపల ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోందని చెప్పారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా, వేలాది మంది మహిళలకు సాధికారత కల్పించామని, తద్వారా వారు ఈ రంగానికి గణనీయమైన సహకారం అందించగలిగారని ప్రశంసించారు.

Advertisement

Next Story