పార్లమెంట్‌లో ప్రధాని ఎమోషనల్.. పాత భవనంపై భావోద్వేగ ప్రసంగం

by GSrikanth |   ( Updated:2023-09-18 06:20:35.0  )
పార్లమెంట్‌లో ప్రధాని ఎమోషనల్.. పాత భవనంపై భావోద్వేగ ప్రసంగం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ నిర్మాణాన్ని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. 75 ఏళ్లలో భారత్ ప్రయాణం ఎంతో ఉత్తమమైనదని చెప్పారు. ఈ చారిత్రాత్మక భవనం మనకు మున్ముందు ఎన్నో నేర్పుతుందని అన్నారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని.. ఎన్నో అద్భుతాలు జరిగాయని వెల్లడించారు. చరిత్రను తెలుసుకోవాల్సిన సమయమిది అని చెప్పారు. 100 ఏళ్ల ప్రతిష్టాత్మక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నామని అన్నారు. ఈ కొత్త పార్లమెంట్‌ను దేశ ప్రజలు చెమటోడ్చి కట్టారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి పాత భవనం సూచిక అని వెల్లడించారు. కొత్త భవనంలోకి వెళ్లినా పాత భవనం ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. పాత భవనం అనేక చారిత్రక ఘట్టాలకు వేదికైందని గుర్తుచేశారు. పాత భవనంలో మనకు తీపి, చేదు, జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ భవనంలో చర్చలు, వాదనలు, ఎన్ని ఉన్నా మన గౌరవాన్ని మరింత పెంచిందని చెప్పారు.

తొలిసారి భవనంలో అడుగుపెట్టినప్పుడు గడపగడపకు శిరస్సు వచ్చి నమస్కరించానని అన్నారు. పాత భవనాన్ని ప్రజల సందర్శన కోసం తెరిచే ఉంచుతామని ప్రకటించారు. జీ20 సక్సెస్ దేశ ప్రజల విజయమని తెలిపారు. చంద్రయాన్-3తో మన శాస్త్రవేత్తలు దేశ సత్తా చాటారని అభినందించారు. భారత్ అభివృద్ధి ప్రపంచమంతా ప్రకాశిస్తోందని చెప్పారు. భారత సామర్థ్యాన్ని ప్రతీ దేశం ప్రశంసిస్తోందని అన్నారు. జీ20లో ఆఫ్రికన్ యూనియన్ రావడం చారిత్రక ఘట్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు భారత్ మిత్ర దేశంగా మారిందని అన్నారు. భారతీయుల విలువలు.. ప్రమాణాలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. అనేక రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. పార్లమెంట్‌‌లో క్రమక్రమంగా మహిళల సంఖ్య అద్భుతంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed