యూపీ ప్రజలు సత్యాన్ని అర్థం చేసుకున్నారు..ప్రియాంకా గాంధీ ప్రశంసలు

by vinod kumar |
యూపీ ప్రజలు సత్యాన్ని అర్థం చేసుకున్నారు..ప్రియాంకా గాంధీ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి అత్యధిక స్థానాల్లో గెలుపు అందించిన ఉత్తరప్రదేశ్ ప్రజలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రశంసల వర్షం కురిపించారు. ఈ దేశంలో సత్యాన్ని అర్థం చేసుకున్నారని, వారు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నానని కొనియాడారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి చేసే ప్రయత్నింలో గట్టి సందేశాన్ని పంపారని తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రియాంకా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘యూపీ కాంగ్రెస్‌ శ్రేణులందరికీ నా వందనం. మీరు ఎండలో, దుమ్ములో కష్టపడి పనిచేయడం చూశాను. మీపై ఫేక్ కేసులు పెట్టారు, పదే పదే గృహ నిర్బంధంలో ఉంచారు, కానీ దేనికీ భయపడి పారిపోలేదు. అంతేగాక ఎంతో దృఢంగా నిలబడ్డారు. ఈ కష్టానికి తగిన ఫలితాన్ని యూపీ ప్రజలు అందించారు’ అని పేర్కొన్నారు.

నేటి రాజకీయాల్లో పాత ఆదర్శాలను యూపీ ప్రజలు మళ్లీ నెలకొల్పారని వెల్లడించారు. ప్రజల సమస్యలే ప్రధానమని, వాటిని విస్మరిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే పై చేయి సాధించారన్నారు. కాగా, యూపీలోని 80 స్థానాలకు గాను ఇండియా కూటమి 43 సీట్లు కైవసం చేసుకుంది. మరోవైపు కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే వయనాడ్ నుంచి ఎంపీగా కొనసాగడానికి రాహుల్ సుముఖంగా ఉన్నారని, రాయ్ బరేలీ నుంచి ఉప ఎన్నిక నిర్వహిస్తే అక్కడ నుంచి ప్రియాంక బరిలోకి దిగుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రియాంక వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Next Story