దేశ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by vinod kumar |
దేశ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించిన బీజేపీకి దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ‘ఎన్నికల ముందు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని, చించేస్తామని చెప్పారు. కానీ ఎలక్షన్స్ తర్వాత రాజ్యాంగం ముందు ప్రధాని నమస్కరించారు. దేశ ప్రజలు ప్రేమ, ఆప్యాయతలతో ద్వేషాన్ని ఓడించారు’ అని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మలప్పురంలోని ఎడవన్నలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. వయనాడ్‌ సీటును వదులుకోవాలా లేక రాయ్‌బరేలీని వదులుకోవాలా అనే డైలమాలో ఉన్నట్టు తెలిపారు. తుది పిలుపు ఇచ్చే ముందు వయనాడ్, రాయ్‌బరేలీ ప్రజల మాట వింటానన్నారు.

రెండు నియోజకవర్గాల ప్రజలను సంతోషపెట్టే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ‘మోడీలా నాకు దేవుడి నుంచి మార్గదర్శకత్వం లభించడం లేదు. నేను సామాన్య మానవుడిని. నాకు పేద ప్రజలే దేవుళ్లు. ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని చెప్పారు. ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తనకు విజయాన్ని కట్టబెట్టిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వీడీ సతీశన్‌, రమేష్‌ చెన్నితాల ఇతర యూడీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed