Train Accident: తెగిపోయిన కప్లింగ్.. ప్యాసింజర్ రైలుకి ప్రమాదం

by Shamantha N |
Train Accident: తెగిపోయిన కప్లింగ్.. ప్యాసింజర్ రైలుకి ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. బిహార్ లోని బక్సర్‌లో ప్యాసింజర్ రైలు రెండుగా విడిపోయింది. రఘునాథ్‌పూర్‌, తురిగంజ్‌ స్టేషన్ల మధ్య అకస్మాత్తుగా కప్లింగ్‌ తెగిపోవడంతో రైలు రెండుగా విడిపోయింది. దీంతో, ఇంజిన్ వెనుక ఉన్న కొన్ని కోచ్‌లు మినహా మిగిలిన కోచ్‌లన్నీ ముందుకు వెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదని అధికారులు వెల్లడించారు.

అరకిలోమీటరు పరిగెత్తిన బోగీలు

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు నంబర్ 20802 డౌన్ మగద్ ఎక్స్‌ప్రెస్ సరిగ్గా ఉదయం 11 గంటలకు డుమ్రాన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ రైలు స్టార్ట్ అయిన నిమిషాల వ్యవధిలోనే ప్రమాదేం జరిగింది. కాగా.. ఇంజన్ లేకుండానే ట్రాక్‌పై అర కిలోమీటరు దూరం బోగీలు పరిగెత్తి ఆగాయి. దీంతో రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో అరుపులు వినిపించాయి. సమీపంలో రైల్వే క్రాసింగ్ ఉండడంతో పెద్ద సంఖ్యలో జనం కూడా అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కప్లింగ్ మరమ్మతు పనులను ప్రారంభించారు. మరోవైపు, ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ.. విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డివిజనల్ రైల్వే సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed