IND VS BAN : ఒక్క స్థానం కోసం అక్షర్, కుల్దీప్, ఆకాశ్ పోటీ.. ఎవరికి దక్కుతుందో చాన్స్

by Harish |
IND VS BAN : ఒక్క స్థానం కోసం అక్షర్, కుల్దీప్, ఆకాశ్ పోటీ.. ఎవరికి దక్కుతుందో చాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : దాదాపు ఆరు నెలల తర్వాత టీమ్ ఇండియా టెస్టులు ఆడబోతున్నది. సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. చెన్నయ్ వేదికగా ఈ నెల 19 నుంచి 23 వరకు తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే చెపాక్ స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మరోవైపు, ఈ టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎంపికపై హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ దళం కూర్పుపై ఫోకస్ పెట్టారు. అదనపు పేసర్‌ను తీసుకోవాలా?లేదా స్పిన్నర్‌ను తీసుకోవాలా? అనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచిస్తున్నది. ఒక స్థానం కోసం యువ పేసర్ ఆకాశ్ దీప్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పోటీపడుతున్నారు.

ఆరంభంలో పేసర్లు.. ఆ తర్వాత స్పిన్నర్లు

చెపాక్ స్టేడియంలో ఎర్ర మట్టి పిచ్‌పై మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నల్ల మట్టి పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి ఎంపిక తేలికగా ఉండేది. కానీ, ఎర్రమట్టి పిచ్‌‌‌ను అంచనా వేయడం కష్టం. కాబట్టి, బౌలర్ల ఎంపిక గంభీర్, రోహిత్‌కు అదనపు తలనొప్పిగా మారనుంది. దక్షిణ భారత దేశంలో ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో పిచ్ తేమగా ఉండే చాన్స్‌లు ఉన్నాయి. పిచ్ ఆరంభంలో పేసర్లకు, మ్యాచ్ జరిగేకొద్ది స్పిన్నర్లకు అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఆ స్థానం ఎవరిదో?

బౌలింగ్ దళంలో పేసర్లు బుమ్రా, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా‌లకు చోటు దాదాపు ఖాయమనే తెలుస్తోంది. మరో స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఎర్ర మట్టి పిచ్‌పై అదనపు పేసర్‌ను తీసుకుందామా? లేదా స్పిన్నర్‌ను తీసుకోవాలా? అని టీమ్ మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తున్నది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ రేసులో అక్షర్ పటేల్ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అందుకు అతని బ్యాటింగ్ సామర్థ్యమే కారణం. అలాగే, స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోవాలనుకుంటే కుల్దీప్‌ను ఎంచుకోవచ్చు. చెన్నయ్‌లో చివరిసారి ఆడినప్పుడు కుల్దీప్ రెండే వికెట్లు తీసుకున్నాడు. కానీ, ఇటీవల అతను సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. మరోవైపు, బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా మూడో పేసర్‌గా ఆకాశ్ దీప్ పేరును కూడా టీమ్ మేనేజ్‌మెంట్ పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌పై 4వ టెస్టులో అరంగేట్రం చేసిన ఆకాశ్ ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరి, తుది జట్టులో ఎవరికి చాన్స్ దక్కుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed