‘ఇండియా’ను చూసి బీజేపీకి వ‌ణుకు మొద‌లైంది.. కేంద్ర స‌ర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్‌

by Vinod kumar |
‘ఇండియా’ను చూసి బీజేపీకి వ‌ణుకు మొద‌లైంది.. కేంద్ర స‌ర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్‌
X

లండ‌న్ : విప‌క్ష కూటమి ‘ఇండియా’ను చూసి పాల‌క బీజేపీకి వ‌ణుకు మొద‌లైంద‌ని, అందుకే ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మార్చే అంశాన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అసలు సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని మ‌ళ్లించేందుకే మోడీ సర్కారు ఈ ఎత్తుగ‌డ‌లు వేస్తోందని దుయ్యబ‌ట్టారు. యూర‌ప్ ప‌ర్యట‌న‌లో ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం బెల్జియంలోని బ్రసెల్స్‌లో విలేక‌రుల స‌మావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘విపక్ష కూటమి వల్ల కేంద్ర సర్కారుకు కలిగిన భయం నుంచి వచ్చిన ఆలోచనే ఇండియా పేరు మార్పు’’ అని పేర్కొన్నారు.

అదానీ వ్యవ‌హ‌రం, క్రోనీ క్యాపిట‌లిజంపై కాంగ్రెస్ విరుచుకుప‌డిన‌ప్పుడ‌ల్లా దేశ ప్రజ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు కేంద్ర సర్కారు స‌రికొత్త డ్రామాకు తెరలేపుతోందని విమర్శించారు. ‘‘ఇండియా కూట‌మి పేరు ప్రధాని మోడీకి చికాకు కలిగిస్తోంది. ఎంత‌గా అంటే దేశం పేరును మార్చేటంత‌గా’’ అని రాహుల్ ఆరోపించారు. దేశాన్ని ‘ఇండియా-భార‌త్’ అనే రెండు పేర్లతో పిల‌వ‌డం అద్భుత‌మైన ఆలోచ‌న అని ఆయన పేర్కొన్నారు. ఇండియా అనేది రాష్ట్రాల స‌మాఖ్య అని రాజ్యాంగం చెబుతోందని, ఏ విషయంలోనైనా కేంద్రం నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రాలను సంప్రదిస్తే స‌మాఖ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని సూచించారు. భారత్‌లో ప్రస్తుతం గాంధీ, గాడ్సీ విజ‌న్‌ల మ‌ధ్య పోరాటం జ‌రుగుతోందన్నారు.

Advertisement

Next Story