USA: పాక్ మిసైల్స్ తయారు చేయడం మాకు కూడా ముప్పే

by Shamantha N |   ( Updated:2024-12-20 05:08:21.0  )
USA: పాక్ మిసైల్స్ తయారు చేయడం మాకు కూడా ముప్పే
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ తయారు చేస్తున్న మిసైల్స్ పై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ(long-range ballistic missile) వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాకిస్థాన్ (Pakistan)కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా (USA) ఆంక్షలు విధించింది. కాగా.. ఈ సమయంలో పాక్ తయారు చేస్తున్న మిసైల్స్ పై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ అటువంటి మిసైల్స్ తయారుచేయడం తమకు సైతం ముప్పేనని అగ్రరాజ్యం పేర్కొంది. ఈమేరకు అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్‌ మీడియాతో మాట్లాడారు. పాక్‌ దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో సహా దక్షిణాసియా దేశాలకు పెద్ద ముప్పు అని ఫైనర్ తెలిపారు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. 2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత పాకిస్థాన్ తో ఒకప్పటిలా సత్సంబంధాలు లేవన్నారు. మరోవైపు, పాక్‌ (Pakistan) దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల తయారీకి మద్దతిచ్చేందుకు అమెరికా చాలాకాలం నుంచి నిరాకరిస్తూ వస్తుందని పెంటగాన్ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. ‘పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి చేస్తుందనే ఆందోళనతోనే ఆంక్షలు విధించాం. అయితే, అవి ఇరుదేశాలకు సంబంధించిన ఇతర రంగాలను ప్రభావితం చేయవు. ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధనకు అగ్రరాజ్యం కట్టుబడి ఉంది. పాకిస్థాన్ అందులో ముఖ్యమైన భాగస్వామి. అయినప్పటికీ, పాక్ తయారుచేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాలపై మా ఆందోళనలు స్పష్టంగా ఉన్నాయి’ అని తెలిపారు.

నాలుగు కంపెనీలపై ఆంక్షలు

ఇక, దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీకి సంబంధించి అమెరికా ఆంక్షలు విధించిన జాబితాలో పాక్ ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (NDC) కూడా ఉండటం గమనార్హం. దీంతోపాటు అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి. మరోవైపు.. తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై పాక్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆంక్షలు కేవలం పక్షపాతంతో కూడుకున్నవే అని పాక్ విమర్శలు చేసింది. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో భారత్‌పై పాక్‌ ఆరోపణలు చేసింది. బైడెన్‌ ప్రభుత్వం భారత్‌తో సన్నిహితంగా ఉన్న కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుందని కామెంట్స్‌ చేసింది.

Advertisement

Next Story

Most Viewed