పెట్టుబడులు ఎవరివైనా తయారీ మన ప్రజల చేతులతోనే జరగాలి: ప్రధాని మోడీ

by S Gopi |
పెట్టుబడులు ఎవరివైనా తయారీ మన ప్రజల చేతులతోనే జరగాలి: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల పెట్టుబడులను స్వాగతించదగ్గవే, అయితే ఆయా కంపెనీల ఉత్పత్తులు దేశీయ ప్రజల చేతుల్లో తయారవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సోమవారం జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గ్లోబల్ ఈవీ కంపెనీ టెస్లా భారత ఎంట్రీ గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత పర్యటనను ధృవీకరించిన సంగతి గురించి అడగ్గా, 'భారత్‌లో పెట్టుబడులు రావాలని కోరుకుంటాను. ఎందుకంటే దేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టారనేది పట్టింపు కాదు, తయారీలో చిందే ప్రతి చెమట చుక్క మన ప్రజలదే అవ్వాలి. భారత మాత ప్రత్యేకత కనబడాలని, అప్పుడే మన దేశ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని' మోడీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 2015లో టెస్లా ఫ్యాక్టరీ సందర్శించిన విషయాన్ని పంచుకున్న మోడీ, ఆ రోజు ఎలన్ మస్క్ ఫ్యాక్టరీలో ఉన్న అన్నీ తనకు చూపించాడు. మళ్లీ గతేడాది అమెరికాకు వెళ్లి కలిశాను. ఇప్పుడు ఎలన్ మస్క్ భారత్‌కు రానున్నారని తెలిపారు. కాగా, ఈ ఇంటర్వ్యూలో పలు రాజకీయ అంశాలు, ఎన్నికల బాండ్లు సహా అనేక విషయాలపై మోడీ మాట్లాడారు.

Advertisement

Next Story