అట్టహాసంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం

by Harish |   ( Updated:2023-03-22 17:07:43.0  )
అట్టహాసంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
X

న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం అట్టహాసంగా జరిగింది. 2023 సంవత్సరానికి గానూ మొత్తం 106 మంది ఈ అవార్డులకు ఎంపికైన విషయం తెలిసిందే. వీరి జాబితాను కేంద్రం జనవరి 25న ప్రకటించింది. వీరిలో బుధవారం 50 మందికి పైగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోగా, మిగిలినవారు మరొక వేడుకలో అందుకోనున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

కాగా, మొత్తం 106 అవార్డుల్లో ఆరుగురిని పద్మవిభూషణ్, 9 మందిని పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో ఏడుగురు మరణానంతరం అవార్డులకు ఎంపికయ్యారు. పద్మ అవార్డులలో మొదటిదైన పద్మ విభూషణ్‌.. దిగ్గజ రాజకీయ నేత, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌‌ను మరణానంతరం వరించగా, ఆయనతోపాటు, డయేరియా, కలరా, డీహైడ్రేషన్‌ నుంచి రక్షించే ఓఆర్ఎస్(ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త దిలీప్ మహాలనబిస్‌(బెంగాల్)కు, అర్కిటెక్చర్ విభాగంలో బాలక్రిష్ణ దోషీ(గుజరాత్)కి సైతం మరణానంతరం పురస్కారం వరించాయి.

అలాగే, కళా విభాగంలో తబలా ప్లేయర్ జకీర్ హుస్సేన్(మహారాష్ట్ర), కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం క్రిష్ణ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఎన్ఆర్ఐ శ్రీనివాస వర్ధన్(యూఎస్)‌ పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు.

ఇక, తెలుగు రాష్ట్రాలకు ఈసారి మొత్తం 12 అవార్డులు రాగా, అందులో తెలంగాణకు 5, ఏపీకి 7 పురస్కారాలు వచ్చాయి. తెలంగాణ నుంచి ఆధ్యాత్మికం, ఇతర విభాగాల్లో చినజీయర్‌, కమలేశ్ డి పటేల్‌ పద్మభూషణ్‌కు ఎంపికవ్వగా, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో విజయ్ గుప్తా, మెడిసిన్ విభాగంలో పసుపులేటి హనుమంతరావు, సాహిత్యంలో రామక్రిష్ణారెడ్డిలను పద్మశ్రీ అవార్డులు వరించనున్నాయి.

ఏపీ నుంచి కళా విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి, కోట సచ్చిదానంద శాస్త్రి, సీవీ రాజు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో అబ్బారెడ్డి నాగేశ్వర రావు, గణేశ్ నాగప్ప- క్రిష్ణరాజనగర(ఇద్దరికి కలిపి), సోషల్ వర్క్ విభాగంలో సంకురాత్రి చంద్ర శేఖర్, సాహిత్యం, విద్యావిభాగంలో ప్రకాశ్ చంద్రసూద్‌లు పద్మ శ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.

Advertisement

Next Story

Most Viewed