భారత ఎన్నికల గురించి పాశ్చాత్య మీడియా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జైశంకర్ కౌంటర్

by S Gopi |
భారత ఎన్నికల గురించి పాశ్చాత్య మీడియా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జైశంకర్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత లోక్‌సభ ఎన్నికల గురించి పాశ్చాత్య మీడియా చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నేతల తరహాలో మీడియా కామెంట్లు ఉన్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఎండాకాలం విపరీతంగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై ప్రశ్నిస్తూ విదేశీ మీడియాలో కథనాలు రావడంపై జైశంకర్ మండిపడ్డారు. 'మన దేశ ఎన్నికల గురించి పాశ్చాత్య మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నట్టు తెలిసింది. వారంతా మన ప్రజాస్వామ్యాన్ని సరైన సమాచారం లేక విమర్శించడంలేదు. వారు సైతం దేశీయంగా మన రాజకీయ నాయకుల తరహాలోనే ఆలోచిస్తున్నారు. అత్యధిక వేసవిలో ఎన్నికలేంటని వారంటున్నారు. ఇంత ఎండలో కూడా మన దేశంలో నమోదయ్యే అత్యల్ప ఓటింగ్ శాతం, విదేశాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ కంటే ఎక్కువగానే ఉంటుందని గుర్తించాలి అంటూ వ్యాఖ్యానించారు. మన దేశ రాజకీయలు అంతర్జాతీయంగా చర్చనీయాంసం అవుతున్నాయి. ప్రపంచ రాజకీయాలు మన దేశంలోకి వస్తున్నాయి. విదేశీ మీడియా మన ఎన్నికలు, ఈవీఎంలు, ఎన్నికల కమిషన్, చివరకు మన దేశ వాతావరణ పరిస్థితుల గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. వాటిని ఎదుర్కొనేందుకు మరింత సమర్థవంతంగా ఉండాలని జైశంకర్ అన్నారు. గ్లోబల్ వేదికపై భారత ప్రాముఖ్యతను ప్రస్తావించిన జైశంకర్, ఏదో ఒకవిధంగా భారత్ గురించి మాట్లాడేందుకు, భారత్‌తో కనెక్ట్ అయ్యేందుకు, భారత్‌తో కలిసి పనిచేసేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమైందని జైశంకర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story