Oshin Sharma: సోషల్ మీడియాలో యాక్టివ్.. పనిలో డల్.. మహిళా అధికారి ట్రాన్స్‌ఫర్

by Ramesh Goud |   ( Updated:2024-09-15 12:06:06.0  )
Oshin Sharma: సోషల్ మీడియాలో యాక్టివ్.. పనిలో డల్.. మహిళా అధికారి ట్రాన్స్‌ఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని ఓ మహిళ అధికారిని ట్రాన్స్ ఫర్ చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. ఓషిన్ శర్మ అనే ప్రభుత్వ అధికారిని మండిలోని సంధోల్‌లో తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె నిరంతరం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఒకవైపు తహసీల్దార్ గా బాధ్యతలు చేపడుతూనే సోషల్ మీడియాలో అవేర్‌నెస్ ప్రోగ్రాంలతో పాటు యువతను ఇన్‌ఫ్లూయేన్స్ చేసేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తోంది. ఇందులో ఓ వీడియో వైరల్ కావడంతో గతంలో అసెంబ్లీలో సైతం ఆమె గురించి చర్చ జరిగింది.

దీంతో ఇటీవల మండి జిల్లా కలెక్టర్ అపూర్వ దేవగన్ సంధోల్ తహసీల్దార్ ఓషిన్ శర్మ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సమయానికి ఏ పని పూర్తి చేయలేదని, ఆ ప్రాంతంలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ప్రభుత్వ పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అంతేగాక ఆమెను సంధోల్ నుంచి బదిలీ చేశారు. ఇదిలా ఉండగా.. ఓషిన్ శర్మను మరే ఇతర ప్రాంతానికి బదిలీ చేయకుండా సిమ్లాలోని పర్సనల్ డిపార్ట్ మెంట్ విభాగానికి రిపోర్ట్ చేయాలని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఓషిన్ శర్మ సోషల్ మీడియా అకౌంట్ కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

Advertisement

Next Story