ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే చరిత్ర మీది- జైరాం రమేశ్

by Shamantha N |
ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే చరిత్ర మీది- జైరాం రమేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ పరాన్న జీవి అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ నిప్పులు చెరిగారు. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే చరిత్ర బీజేపీది అని ఆరోపించారు. అసలైన పరాన్నజీవి బీజేపీ అని మండిపడ్డారు. మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఆయన.. పరాన్నజీవి మాత్రమే ఆ పదాన్ని వాడుతాడని చురకలు అంటించారు. ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఎలా వాడుకుందో ట్రాక్ రికార్డు చూడాలన్నారు. రాజ్యసభలో ఒకప్పటి బీజేపీ మిత్రపక్షం బీజేడీ.. ఇండియా కూటమితో చేతులు కలిపిందన్నారు. పరాన్నజీవి ఎవరైనా ఉంటే.. అది బీజేపీ అని విమర్శలు గుప్పించారు.

వాయుకాలుష్యంతో ఏటా 34వేల మంది మృతి

దేశంలో ఏటా 34,000 మంది వాయుకాలుష్యంతో చనిపోతున్నారని జైరాం రమేశ్ అన్నారు. 'ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్'లో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నివేదిక చూస్తే వాయుకాలుష్యం ఎంత ఘోరంగా ఉందో తెలుస్తోందన్నారు. “దేశంలో మొత్తం మరణాలలో 7.2 శాతం వాయు కాలుష్యంతోనే ముడిపడి ఉన్నాయి. కేవలం 10 నగరాల్లో ఏటా దాదాపు 34,000 మంది మరణిస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే ఏటా 12వేల మంది వాయు కాలుష్యం వల్ల చనిపోతున్నారు. పూణే, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలు వేలాది మరణాలకు సాక్ష్యమిస్తున్నాయి” అని జైరామ్ రమేష్ అన్నారు. స్నేహితులకు లాభం చేయాలన్న మోడీ వైఖరి వల్లే వాయుకాలుష్యం పెరిగిపోతుందన్నారు. 2017 నుంచి కోల్ పవర్ ప్లాంట్స్ లో ఎఫ్జీడీ పరికరాలను ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. పవర్ ప్లాంట్స్ యజమానుల లాభం కోసమే మోడీ ఇలా చేశారని.. దీంతో వేలాది మంది మరణించారని ఆరోపించారు. ఎల్పీజీ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల వంట చెరుకు వాడకం పెరిగి వాయుకాలుష్యం తీవ్రమైందన్నారు. 2019లో ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పూర్తిగా విఫలమైందన్నారు. 2023 చివరి నాటికి 50 శాతం కంటే ఎక్కువగా సీఏపీ నిధులు వాడుకోలేదన్నారు. పర్యావరణ పరిరక్షణపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కేంద్రంపై విరుచుకుపడ్డారు. అటవీ సంరక్షణ(సవరణ) చట్టం-2023 వల్ల అడవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

ఆప్ తో పొత్తుపై ఏమన్నారంటే?

ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జైరాం రమేశ్ తెలిపారు. అక్కడ ఆప్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కన్పించట్లేదన్నారు. కానీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగంగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Next Story

Most Viewed