కొత్త హైకోర్టు న్యాయమూర్తుల్లో 1.5 శాతం మందే ఎస్టీలు..

by Vinod kumar |
కొత్త హైకోర్టు న్యాయమూర్తుల్లో 1.5 శాతం మందే ఎస్టీలు..
X

న్యూఢిల్లీ : దేశంలో గత ఆరేళ్లలో నియమితులైన హైకోర్టు న్యాయమూర్తుల్లో ఎస్సీ వర్గానికి చెందినవారు 3 శాతం మంది, ఎస్టీ కమ్యూనిటీకి చెందినవారు 1.5 శాతం మంది మాత్రమే ఉన్నారని న్యాయశాఖపై ఏర్పాటైన 133వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది. 2018 నుంచి ఇప్పటివరకు వివిధ హైకోర్టులలో మొత్తం 601 మంది న్యాయమూర్తులుగా నియమితులయ్యారని తెలిపింది. వీరిలో 457 (76%) మంది జనరల్ కేటగిరీకి చెందినవారు కాగా, మహిళా న్యాయమూర్తులు 91 (15.1%) మంది, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) న్యాయమూర్తులు 72 (11.9%) మంది, ఎస్సీ కమ్యూనిటీ నుంచి 18 మంది, ఎస్టీ కమ్యూనిటీ నుంచి 9 మంది, మైనారిటీ వర్గాల నుంచి 32 (5.3%) మంది న్యాయమూర్తులు ఉన్నారని కమిటీ పేర్కొంది.

13 మంది న్యాయమూర్తులు ఏ సామాజిక వర్గానికి చెందినవారు అనేది గుర్తించలేకపోయామని వివరించింది. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ నేతృత్వంలోని ఈ కమిటీ.. "న్యాయ ప్రక్రియలు-సంస్కరణలు" అనే అంశంపై ఆగస్టు 7న రాజ్యసభకు సమర్పించిన రిపోర్ట్‌లో ఈ వివరాలను ప్రస్తావించింది. సమాజంలోని అట్టడుగు వర్గాలు, మహిళలు, మైనారిటీలకు ఉన్నత న్యాయ వ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం లభించాల్సిన అవసరం ఉందని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కొలీజియం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed