‘రెడ్ డైరీ’పై మోడీ x గెహ్లాట్.. మాటల యుద్ధం

by Vinod kumar |
‘రెడ్ డైరీ’పై మోడీ x గెహ్లాట్.. మాటల యుద్ధం
X

జైపూర్: రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన ‘రెడ్ డైరీ’పై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధాని మోడీ గురువారం రాజస్థాన్‌లోని సికార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాన్ (ప్రేమ దుకాణం) తెరిచానని చెప్పారు. నిజానికి ఆయన లూట్ కీ దుకాన్ (లూటీ చేసే దుకాణం), ఝూట్ కీ దుకాన్ (అబద్ధాల దుకాణం) తెరిచారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే వద్ద ఉన్న ‘రెడ్ డైరీ’లో కాంగ్రెస్ పార్టీ లూటీ, అబద్ధాల చిట్టా ఉంది’ అన్నారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీ విషయంపైనా గెహ్లాట్ ప్రభుత్వాన్ని మోడీ లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి గెహ్లాట్ సమాధానంగా.. ‘మోడీ చెబుతున్న ‘ఎర్ర డైరీ’ అనేది ఊహ మాత్రమే. లేని ఎర్ర డైరీని మోడీ చూడగలరు. కానీ.. ఎర్ర టమాటాలు, ఎర్ర సిలిండర్ల ధరలు ఆకాశ్శాన్నంటినా ఆయన చూడలేరు. ధరల పెరుగుదలతో ఎర్రగా మారిన ప్రజల ముఖాలను చూడలేరు. రానున్న ఎన్నికల్లో ఆయనకు ప్రజలు ఎర్ర జెండా చూపిస్తారు’ అని ఎదురు దాడి చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ‘ఎర్ర డైరీ’ హల్‌చల్..

గత వారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన వద్ద ‘ఎర్ర డైరీ’ ఉందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ గుఢా సభలో హల్ చల్ చేశారు. ఈ డైరీలో గెహ్లాట్ ప్రభుత్వ రహస్యాలు ఉన్నాయని, ఈ డైరీని విప్పితే చాలా మంది నాయకుల రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని చెప్పారు. 2020లో సచిన్ పైలట్ నేతృత్వంలో గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, ఇండిపెండెంట్, ఇతర ఎమ్మెల్యేలకు చెల్లించిన ముడుపుల వివరాలు ‘ఎర్ర డైరీ’లో ఉన్నాయని తెలిపారు.

బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మీడియా టైకూన్ సుభాష్ చంద్రను ఓడించేందుకు కూడా కాంగ్రెస్ ఎవరెవరికి ఎంతెంత చెల్లించిందన్న వివరాలు కూడా ‘ఎర్ర డైరీ’లో ఉందన్నారు. అయితే.. రాజేంద్ర సింగ్ మాటలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ ఆయనను మార్షల్స్ సాయంతో అసెంబ్లీ నుంచి బయటకు గెంటేసింది.

సభకు గెహ్లాట్ వెళ్లడంపై వివాదం..

సికార్‌లో ప్రధాని మోడీ పాల్గొన్న సభపైనా వివాదం నెలకొంది. ఈ సభకు గెహ్లాట్ రావాల్సి ఉందని, అనారోగ్యం వల్ల రాలేకపోతున్నారని తన ప్రసంగంలో చెప్పిన మోడీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే.. కాలి గాయం కారణంగా డాక్టర్ల సూచన మేరకు సభకు తాను హాజరు కాలేనని, సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు నిమిషాలు మాట్లాడతానన్నానని, తన మంత్రివర్గ సహచరులు సభలో పాల్గొంటారని చెప్పానని ట్వీట్ చేశారు.

తన ప్రతిపాదనకు తొలుత అంగీకరించిన ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు చివరి నిమిషంలో తన ప్రసంగాన్ని షెడ్యూల్ నుంచి తొలగించారని ఆరోపించారు. అందుకే ప్రధానిని తాను ట్విటర్ ద్వారా మాత్రమే ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు విపక్షాలు గతంలో చేసిన తప్పులను దాచి పెట్టేందుకే తమ కూటమి పేరును యూపీఏ నుంచి ఇండియాగా మార్చుకున్నారని మోడీ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story