Omar Abdullah: నిర్ణయం మార్చుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు

by Shamantha N |
Omar Abdullah: నిర్ణయం మార్చుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాంధర్ బల్ నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు ముఖ్య నేతలు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir) కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంతకాలం ఎన్నికలకు దూరంగా ఉంటానని గతంలో ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. గాంధర్‌బల్‌ జిల్లాలో సియం ముస్తఫా అనే నాయకుడు నేషనల్ కాన్ఫరెన్స్ లో చేరారు. ఈ కార్యక్రమానికి ఒమర్‌ అబ్దుల్లా సహా పార్టీ లోక్‌సభ ఎంపీ సయీద్‌ రుహుల్లా మెహ్దీ హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలోనే ఒమర్‌ అబ్దుల్లా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు రుహుల్లా ప్రకటించారు.

మూడు సార్లు ఎంపీగా..

2009 నుంచి 2015 మధ్య కాలంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా పనిచేశారు. మూడు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2008 లో గాంధర్‌ బల్‌ నుంచి, 2014లో బీరవాహ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో గాంధర్ బల్ నుంచి పోటీ చేసిన ఒమర్ అబ్దుల్లా.. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP)కి చెందిన ఖాజీ మొహమ్మద్ అఫ్జల్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18న తొలిదశలో కశ్మీర్ వ్యాలీతో పాటు జమ్ము డివిజన్ లో ఎన్నికలు జరగనున్నారు. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న తుదివిడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు రానున్నాయి.

Advertisement

Next Story