Omar Abdullah: కాంగ్రెస్‌తో అందుకే పొత్తు పెట్టుకున్నాం.. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా

by vinod kumar |
Omar Abdullah: కాంగ్రెస్‌తో అందుకే పొత్తు పెట్టుకున్నాం.. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పొత్తు పెట్టుకోవడానికి గల కారణాన్ని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. కశ్మీర్ ప్రజలను హంగ్ అసెంబ్లీ నుంచి రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆదివారం దాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను పొడిగించడాన్ని సాకుగా చూపి హంగ్ అసెంబ్లీని బీజేపీ కోరుకుంటుందన్నారు. కానీ ప్రజలు అలా జరగనివ్వబోరని తేల్చి చెప్పారు. ‘బీజేపీకి కశ్మీర్‌లో ఏమీ లేదు. ముస్లింల పట్ల వారి వైఖరి గురించి స్పష్టంగా తెలుసు. దేశంలో పదహారు శాతం ముస్లిం జనాభా ఉన్నారు. కానీ కాషాయ పార్టీలో ఒక్క ముస్లిం నాయకుడు కూడా లేడు. ఈ జనాభాకు ప్రాతినిధ్యం లేనప్పుడు, ముస్లింల పట్ల వారికి ఎలాంటి ఆలోచన ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్‌కు బీజేపీ చేసిందేమీ లేదని, అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు మూడు కుటుంబాలను టార్గెట్‌గా చేసుకుని అసత్య ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్, ఎన్సీ పార్టీలపై విమర్శలు చేస్తుందని తెలిపారు. కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. కశ్మీర్ యువతను ఉద్యోగాల పేరుతో బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లో ఈ నెల 25న రెండో దశ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed