రామ భక్తిపై బీజేపీకి కాపీ రేట్ లేదు.. ఏ పార్టీకి ఓటేయాలో తేల్చుకోండి: Uma Bharti

by Harish |   ( Updated:2022-12-30 14:02:20.0  )
రామ భక్తిపై బీజేపీకి కాపీ రేట్ లేదు.. ఏ పార్టీకి ఓటేయాలో తేల్చుకోండి: Uma Bharti
X

భోపాల్: శ్రీరాముడిని, హనుమాన్‌ని పూజించడంలో బీజేపీకి కాపీ రైట్ లేదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకురాలు ఉమా భారతి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు అయిన కమలనాథ్ రాష్ట్రంలో హనుమాన్ మందిర నిర్మాణాన్ని చేపట్టడంపై వివాదం ఎందుకని ఆమె ప్రశ్నించారు. వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీకి తలనొప్పి కలిగిస్తున్న ఉమాభారతి ఏ పార్టీకి తాము ఓటువేయాలో చూసి నిర్ణయించుకోండి అంటూ పార్టీ కార్యకర్తలకు ఇటీవలే పిలుపునిచ్చి కలవరం సృష్టించారు.

తాజాగా రామ, హనుమాన్ భక్తి బీజేపీ సొంతం కాదని చెప్పి మరో సంచలనం కలిగించారు. అందరికంటే సీనియర్‌ని అయిన తనను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉమాభారతి పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో పార్టీతరపున ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య నిషేధాన్ని ఎందుకు ప్రకటించలేదని ఆమె ధ్వజమెత్తారు.

స్వయంగా ఒక లిక్కర్ షాపుపై రాళ్లు విసిరి పతాక శీర్షికలకు ఎక్కిన ఉమా భారతి హిందువులు ఇళ్లలో ఆయుధాలు పెట్టుకోవాలంటూ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించారు. వనవాసంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు కూడా ఆయుధాలు వదలిపెట్టనని శపథం చేశాడని, ఆయుధాలు ఉంచుకోవడం తప్పు కాదని బీజేపీ ఫైర్ బ్రాండ్ పేర్కొన్నారు. కానీ హింసాత్మక ఆలోచనలు ఉంచుకోవడం తప్పని ఆమె చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed