పోక్సో చట్టంలో లింగ వివక్షకు తావు లేదు: ఢిల్లీ హైకోర్టు

by Mahesh |
పోక్సో చట్టంలో లింగ వివక్షకు తావు లేదు: ఢిల్లీ హైకోర్టు
X

న్యూఢిల్లీ : లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ కల్పించేందుకు సంబంధించిన పోక్సో చట్టం తటస్థమైందని, అది లింగ వివక్షకు తావు ఇవ్వదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లింగ వివక్ష ఉండటం వల్ల ఈ చట్టం దుర్వినియోగం అవుతోందనే వాదనలను న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు. పోక్సో చట్టం బాధితులను మైనర్లుగా చూస్తుందే తప్ప.. బాలబాలికల తేడాతో చూడదని తేల్చి చెప్పారు. 2016 లో ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, పోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ శర్మ బుధవారం విచారించారు. సీఆర్పీసీ సెక్షన్ 311 కింద తన దరఖాస్తును తిరస్కరించిన ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితుడు రాకేష్ హైకోర్టును ఆశ్రయించారు.

గతంలో వారి క్రాస్ ఎగ్జామినేషన్ లాంఛనప్రాయమైనందున బాధితురాలిని, ఆమె తల్లిని మళ్లీ పిలిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. లింగ వివక్షకు తావు ఇచ్చేలా పోక్సో కేసులో ట్రయల్ కోర్టు తీర్పు వచ్చిందని ఆరోపించాడు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను ట్రయల్ కోర్టు నమోదు చేసి ఆరేళ్లు గడిచిపోయాయని పేర్కొంది. అందువల్ల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. "లింగ ఆధారితమైన, కాకపోయినా ఏదైనా చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అయితే చట్టసభలు ఆ చట్టాలను రూపొందించడం మానేయాలని, న్యాయవ్యవస్థ వాటిని అమలు చేయడం మానేయాలని దీని అర్థం కాదు" అని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ పేర్కొన్నారు. నేరాల ముప్పును నిరోధించడానికి, నిజమైన బాధితులకు న్యాయం చేయడానికే చట్టాలను అమలు చేస్తారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed