'పీఎం అభ్యర్థిత్వం మీకొద్దంటే.. దీదీకి ఇవ్వండి'

by Vinod kumar |
పీఎం అభ్యర్థిత్వం మీకొద్దంటే.. దీదీకి ఇవ్వండి
X

న్యూఢిల్లీ : ప్రధాని పదవిపై తమ పార్టీకి ఆసక్తి లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించిన నేపథ్యంలో దానిపై ప్రతిపక్ష కూటమి "ఇండియా" (INDIA)లో చర్చ మొదలైంది. ప్రధానమంత్రి పదవి అభ్యర్థిత్వం విషయంలో తొలిసారిగా ఒక పేరు తెరపైకి వచ్చింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 2024 లోక్ సభ ఎన్నికల కోసం విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శతాబ్ది రాయ్ కోరారు. కాంగ్రెస్‌కు పీఎం పోస్టుపై ఆసక్తి లేకుంటే.. ఆ అవకాశాన్ని దీదీకి ఇవ్వాలన్నారు.

"మమతా బెనర్జీ ప్రధాని కావాలని మేం నిండు మనసుతో కోరుకుంటున్నాం. కలలు కనడంలో.. ఆశలు, ఆశయాలతో ముందుకు సాగడంలో తప్పులేదు" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్య స్పందిస్తూ.. " పీఎం అభ్యర్థిని ఖరారు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఇప్పుడే బంతిని తిప్పడం మొదలుపెట్టాం. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ బలమైన స్థితికి ఎదగొచ్చు. ఈ తరుణంలో ప్రధాని పీఠంపై ఎలాంటి అంచనాలూ సరికావు. ఇలాంటి టాపిక్స్‌పై విపక్ష కూటమి సమావేశాల్లోనే చర్చ జరగాలి’’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed