నితీష్ ప్రయత్నం.. ఈసారైనా వర్కౌట్ అయ్యేనా?

by Sathputhe Rajesh |
నితీష్ ప్రయత్నం.. ఈసారైనా వర్కౌట్ అయ్యేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు పలువురు నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చిన కొద్ది రోజులకే బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ ఖర్గేతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఖర్గేతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలతోనూ నితీష్ సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే మోడీని ఢీ కొట్టాలంటే ఐక్యమత్యం అనివార్యం అని భావిస్తున్న విపక్ష పార్టీలు ఆ దిశగా మాత్రం పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదు. విపక్ష పార్టీల మధ్య ఉన్న విభేదాలు బీజేపీకి మరింత కలిసి వచ్చే అంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ తాజా టూర్ ఉత్కంఠ రేపుతోంది.

ఆ పార్టీల మధ్య గ్యాప్ తగ్గేనా..?

బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చిన నితీష్ కుమార్ గతంలో ప్రతిపక్ష నేతలతో వరుసగా సమావేశం అయ్యారు. తదనంతరం విపక్ష కూటమిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అదానీ వ్యవహారంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలు, రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై ఒక్కో పార్టీ ఒక్కో రీతిలో రియాక్ట్ కావడం వంటి కీలక అంశాలు ప్రతిపక్ష కూటమిలో గందరగోళానికి దారి తీసే పరిణామాలుగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఆప్ మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి ఏకం చేసేందుకు కీలక పాత్ర పోషించే ప్రయత్నాలు మళ్లీ మొదలుపెట్టడం ఆసక్తిగా మారింది. అయితే అన్ని సజావుగా జరిగితే కాంగ్రెస్‌కు ఇతర ప్రాంతీయ పార్టీలకు మధ్య తానే వారధిగా ఉండాలని నితీష్ ఎదురు చూస్తున్నట్లు జేడీయూలో చర్చ జరుగుతోంది. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి. ఇక నితీష్ ప్రయత్నంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని పదవి కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని కమలనాథులు సెటైర్లు వేస్తుంటే ఆ పదవి తనకు వద్దని నితీష్ చెబుతున్నారు.

Advertisement

Next Story