ప్రాంతీయ పార్టీల ‘వన్ టు వన్’ ఫార్ములా.. నితీష్ ప్రతిపాదనకు మమత ఓకే: జేడీ-యూ

by Vinod kumar |
ప్రాంతీయ పార్టీల ‘వన్ టు వన్’ ఫార్ములా.. నితీష్ ప్రతిపాదనకు మమత ఓకే: జేడీ-యూ
X

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీని ఓడించేందుకు ‘వన్-టు-వన్’ (ముఖాముఖి పోరు) ఫార్ములానే సరైనదని ప్రాంతీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. బీహార్ సీఎం, జనతాదళ్-యునైటెడ్ (జేడీ-యు) అధినేత ప్రతిపాదించిన ఈ ఫార్ములాను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించారని జేడీ-యూ సీనియర్ నేత కె.సి.త్యాగి తెలిపారు. కాంగ్రెస్ ను ఇంతకాలం విమర్శించిన మమత.. కాంగ్రెస్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారని నితీష్ తో సమావేశం తర్వాత పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలని.. కాంగ్రెస్ బలంగా ఉన్న 200కు పైగా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు మద్దతివ్వాలన్న నితీష్ ప్రతిపాదనను మమత అంగీకరించారన్నారు.

దీంతో 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యాన్ని విరమించుకున్నట్లు నితీష్ తో మమత అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మమతతో సహా ప్రాంతీయ పార్టీల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారని, కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారని మమత గుర్తించారు. కానీ.. బెంగాల్ లో టీఎంసీ, ఢిల్లీలో ఆప్, బిహార్ లో జేడీఎస్, ఆర్జేడీ, తమిలనాడులో డీఎంకే జార్ఖండ్ లో జేఎంఎం పార్టీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయని, వాటి అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టాలని, అప్పుడే బీజేపీతో ముఖాముఖి పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story