'ఆయన దేశానికి రెండో గాంధీ'.. పొలిటికల్ హీట్‌ పెంచిన పోస్టర్లు

by Vinod kumar |
ఆయన దేశానికి రెండో గాంధీ.. పొలిటికల్ హీట్‌ పెంచిన పోస్టర్లు
X

పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో ఏర్పాటైన పోస్టర్లు పొలిటికల్ హీట్‌ను సృష్టించాయి. జనతా దళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) పార్టీకి చెందిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో ‘‘సీఎం నితీశ్‌ కుమార్‌ రెండో గాంధీ’’ అని కీర్తించారు. ‘‘సామాజిక సంస్కరణలకు బాటలు వేసి.. సమానత్వ పాఠాన్ని నితీశ్‌ బోధించారు’’ అని ఆ పోస్టర్లలో ప్రస్తావించారు. మహాత్మాగాంధీ చూపించిన మార్గాన్ని నితీశ్ అనుసరిస్తున్నారని కొనియాడారు. జేడీయూ మిత్రపక్షమైన ఆర్జేడీకి చెందిన నేత శివానంద్‌ తివారీ స్పందిస్తూ.. ‘‘ఈ పోస్టర్లను నితీశ్‌ భక్తులు అంటించారు. అయితే ఆయనను పొగిడే క్రమంలో గాంధీజీని అవమానించొద్దు.

గాంధీజీలాంటి వారు వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారే పుడతారని రామ్ మనోహర్‌ లోహియా చెప్పారు’’ అని కామెంట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంతల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నితీశ్‌ను మహాత్ముడితో పోల్చడం తుచ్ఛమైన చర్య. గత మూడు దశాబ్దాలుగా నితీశ్‌ కుమార్‌.. లాలూప్రసాద్‌ యాదవ్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రధానమంత్రి పీఠంపై కన్నేయడం వల్ల లాలూ ఒడిలో కూర్చున్నారు. అత్యంత అవకాశవాద రాజకీయ నేత నితీశ్’’ అని విమర్శించారు.

Advertisement

Next Story