కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం..అప్రమత్తమైన ప్రభుత్వం

by vinod kumar |
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం..అప్రమత్తమైన ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని మలప్పురంలో 14ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. అతని పరిస్థితి విషమిస్తే కోజికోడ్ మెడికల్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిఫా వైరస్‌ పరీక్షల నిమిత్తం బాలుడి నమూనాలను పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపగా వైరస్ సోకినట్టు నిర్థారణైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. మలప్పురంలోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

బాలుడితో పరిచయం ఉన్న వ్యక్తుల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు. వైరస్ నియంత్రణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అమలును పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. గబ్బిలాల ఆవాసాలను నాశనం చేయొద్దని, వాటికి అంతరాయం కలిగించడం వల్ల వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని వీణా జార్జ్ ప్రజలకు సూచించారు. కాగా, రాష్ట్రంలో 2018, 2019, 2021, 2023 సంవత్సరాల్లో నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. 2018లో నిఫా వైరస్ కారణంగా 17 మంది, 2023లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed