మౌలిక సదుపాయాల కల్పనకు డీపీఆర్, కాంట్రాక్టర్లకు రేటింగ్ అవసరం: గడ్కరీ

by Vinod kumar |
Nitin Gadkari Says He Often Feels Like Quitting from Politics
X

న్యూఢిల్లీ: జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు డీపీఆర్, కాంట్రాక్టర్లకు రేటింగ్ ఉండాలన్నారు. రహదారుల అభివృద్ధిలో కొత్త టెక్నాలజీని అంగీకరించేందుకు సంబంధిత కంపెనీలు సిద్ధంగా లేవని, దానివల్ల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) సమస్యలను ఎదుర్కొంటోందని గడ్కరీ చెప్పారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన 'క్రిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్ 2023'లో ప్రసంగించిన గడ్కరీ, సిమెంట్, ఉక్కు రంగంలోని బడా కంపెనీలు కావాలనే ధరలను పెంచే పనిలో ఉంటున్నాయన్నారు.

'ఎన్‌హెచ్‌ఏఐకి డీపీఆర్‌ల తయారీ పెద్ద సమస్యగా మారింది. ఏ ప్రాజెక్టులోనూ ఎక్కడా స్పష్టమైన డీపీఆర్ ఉండటంలేదు. కొత్త టెక్నాలజీ, పరిశోధన కలిగిన డీపీఆర్‌లను అంగీకరించేందుకు కంపెనీలు సిద్ధంగా లేవు. దానివల్లే అన్నిచోట్లా డీపీఆర్ రూపకల్పనలో నాణ్యత లోపిస్తోందని' వివరించారు. ఇన్ని సవాళ్ల మధ్య దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు డీపీఆర్, కాంట్రాక్టర్లకు రేటింగ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇక, భారత్‌లో అధిక లాజిస్టిక్స్ ఖర్చుల గురించి మాట్లాడుతూ, చైనాలో 8-10 శాతంతో పోలిస్తే దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14-16 శాతం ఉందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed