New Broadcast Bill: యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లపై నిఘా.. న్యూ బ్రాడ్‌కాస్ట్ బిల్లులో కేంద్రం రూల్స్!

by vinod kumar |
New Broadcast Bill: యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లపై నిఘా.. న్యూ బ్రాడ్‌కాస్ట్ బిల్లులో కేంద్రం రూల్స్!
X

దిశ, నేషనల్ బ్యూరో: సోషల్ మీడియాపై తీవ్ర ప్రభావం చూపే కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (రెగ్యులేషన్)బిల్లు-2024ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఈ చట్టం మొదటి ముసాయిదా గతేడాది రాగా, ప్రస్తుతం అందులో కొన్ని మార్పులు చేసి మళ్లీ ప్రభుత్వం తీసుకురానుంది. అయితే ఈ బిల్లులో రూపొందించిన పలు నిబంధనల వల్ల డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్రం నిఘా ఉంచబోతుందంటూ పలువురు వాపోతున్నారు. దీంతో ఈ బిల్లుపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ సైతం దీనిపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ఏంటి? అందులో ఉన్న నియమ నిబంధనలు ఏంటి? దాని వల్ల సోషల్ మీడియాపై పడే ప్రభావం ఎంత? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1995 టెలివిజన్ నెట్‌వర్క్ యాక్ట్ స్థానంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (రెగ్యులేషన్) బిల్లు-2024 తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం..సోషల్ మీడియాలో వార్తలను ప్రసారం వారందరూ యూట్యూబర్‌లు, ఇన్‌స్టాగ్రామర్‌లు, ఇతర డిజిటల్ క్రియేటర్‌లు తమ పేరు ప్రభుత్వ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక వారి వీడియోలు. పోస్ట్‌లను పరిశీలించి, అవి సరైనవా కాదా అని నిర్ణయించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ వివరాలు సైతం ప్రభుత్వానికి తెలియజేయాలి. బిల్లు అమల్లోకి వచ్చిన ఒక నెలలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే వారి ఖాతాకు సంబంధించిన వివరాలను ఎప్పుడు అడిగినా ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. తమ వినియోగదారుల డీటెయిల్స్ ప్రభుత్వానికి అందించకపోతే చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఇన్‌ఫ్లూయెన్సర్ల సమాచారం అంతా ప్రభుత్వం వద్ద పదిలమయ్యే చాన్స్ ఉంటుంది. దీనివల్ల యూట్యూబ్‌లో వార్లు ప్రసారం చేసే వారిపై, న్యూస్ వెబ్‌సైట్లపై తీవ్ర ఒత్తిడి పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ప్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ వంటి స్ట్రీమింగ్ సేవలకు మాత్రమే ఈ తరహా నిబంధన ఉండేది.

బయటకు రాని ముసాయిదా?

అప్ డేట్ చేసిన ముసాయిదా బిల్లు ఇప్పటి వరకు బహిర్గం కాలేదు. కానీ ఈ బిల్లు గురించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పలువురు నిపుణులతో సమావేశాలు నిర్వహించి చర్చించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బిల్లు ముసాయిదా వెల్లడించి పలువురి సలహాలు, సూచనలు జరిపిన తర్వాతే బిల్లుకు తుది రూపం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత బిల్లుకు ఈ ప్రక్రియ జరగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ బిల్లును ప్రైవేట్‌గా ఎందుకు చెలామణి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ స్పందిస్తూ.. బిల్లు ఇంకా ముసాయిదా దశలోనే ఉందని, వాటాదారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై ఆందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story