ఎన్డీయే ఎంపీల సమావేశం.. నాయకుడిగా మోడీ.. ఆదివారం ప్రమాణస్వీకారం..

by Harish |   ( Updated:2024-06-07 08:35:47.0  )
ఎన్డీయే ఎంపీల సమావేశం.. నాయకుడిగా మోడీ.. ఆదివారం ప్రమాణస్వీకారం..
X

దిశ, నేషనల్ బ్యూరో: శుక్రవారం ఎన్డీయే కూటమి ఎంపీలు ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో మోడీని తమ నాయకుడిగా లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. దీంతో ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేశారు. మొదటగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్డీయే పక్ష నేతగా మోడీని ప్రతిపదించగా హోంమంత్రి అమిత్‌ షాతో సహా అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ సమావేశానికి కొత్తగా గెలిచిన కూటమిలో ఎంపీలందరూ హజరయ్యారు. బీజేపీ చెందిన 240 ఎంపీలతో పాటు, కూటమిలోని మిత్రపక్షాలు, టీడీపీ, జేడీయూ, శివసేన తదితర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు చంద్రబాబు, బీహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌, పవన్‌కళ్యాణ్ వంటి వారు హజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా, చంద్రబాబు సహా ఇతర నాయకులకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ, నాపై విశ్వాసం ఉంచి కూటమి నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇవి నాకు భావోద్వేగ క్షణాలు అని అన్నారు. ఇది ఒక విజయవంతమైన కూటమి, భారత్‌కు ఆత్మగా నిలుస్తుంది. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా. 22 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉండటం ప్రజాస్వామ్య గొప్పతనం, భారతదేశ స్పూర్తికి ఎన్డీయే కూటమి ఒక ఉదాహరణ. ఇది దేశం కోసం పనిచేస్తుంది. ఎన్డీయేలోని ప్రతి ఎంపీ నాకు సమానమే, విజయం సాధించి ఇక్కడికి వచ్చిన నేతలకు శుభాకాంక్షలు అని మోడీ అన్నారు.

ఈ సమావేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా మోడీ దేశానికి సేవ చేశారు. ఎన్డీయే నాయకుడిగా నరేంద్ర మోడీ ఎన్నికకు మా పార్టీ మద్దతు ఇస్తుంది. ఆయన మళ్లీ ప్రధాని అవుతారు. మేము మోడీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాము. మా పార్టీ అన్ని వేళలా ప్రధాని మోడీ వెంటే ఉంటుందని అన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌లో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయని నితీష్ అన్నారు. జూన్‌ 9న మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed